Rains: ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు రుతుపవనాల ఉపశమనం

అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించే సంకేతాలు అందించాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఇక విజయవాడలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గత రెండు వారాలుగా నగరంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రతకి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా భారీ వర్షం కురవడంతో విజయవాడ ప్రజలు సేదతీరారు.
నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇవాళ ఏపీలోని పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మరోవైపు రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com