PORT: మూలపేటలో పోర్టు పనులు పునఃప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణం జిల్లా ప్రజల చిరకాల కోరిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాలి మండలం మూలపేటలో సోమవారం పోర్టు పనులను ఆయన పరిశీలించారు. పోర్టు నిర్మాణంలో కీలకమైన డ్రెజ్లింగ్, బెర్త్ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. అనంతరం పోర్టు బ్రేక్ వాటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. పోర్టు నిర్మాణ స్థితిగతులపై పోర్టు అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం నుంచి పోర్టు పనులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 2025 జూన్ 12వ తేదీలోగా పోర్టు పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటివరకూ మూలపేట పోర్టుకి సంబంధించి జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. అలాగే స్థానికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు, నిర్వాసితుల ఇబ్బందులు అన్నింటిపై చర్చించారు. మూలపేట పోర్ట్ నిర్మాణం చేపడుతున్న విశ్వసముద్ర సంస్థ అధికారులు పోర్టు పనుల స్థితిగతులను మంత్రికి వివరించారు. మూలపేట పోర్ట్ ను పూర్తిచేసిన తర్వాత ఆ ప్రాంతం పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నిర్వాసితులందరికి న్యాయం చేస్తామన్నారు.
జూన్ నాటికి ‘మూలపేట’కు మొదటి షిప్
మూలపేట పోర్టు పనులు శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా మొదటి నౌకను తీసుకొస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. మూలపేట పోర్టు జిల్లా ప్రజల చిరకాల కోరికని అన్నారు. పేదరికం, వలసలు నివారించేందుకు పోర్టు నిర్మాణం ఆవశ్యకమని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నిర్వాసిత గ్రామాలు మూలపేట, విష్ణుచక్రంలో భూసేకరణ, నష్టపరిహార చెల్లింపులు సరిగ్గా చేయలేదని, వాటిని పున:పరిశీలన చేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశీలన చేసి అన్ని సదుపాయాలతో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భావనపాడు నుంచి భోగాపురం వరకు, భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఇసుక కొరత ఏర్పడిందని, ప్రజలందరికీ ఉచిత ఇసుక అందించేందుకు ట్రాక్టర్లకూ అవకాశం కల్పించామని తెలిపారు.
ఉచిత ఇసుకపై..
ఉచిత ఇసుక ఇస్తున్నామని.. సీనరేజి సమస్య ఉండకుండా.. సీనరేజి రద్దు చేశామన్నారు. 300 కోట్లు నష్టం వచ్చినా సీనరేజి రద్దు చేశామన్నారు. ట్రాక్టర్ ఉంటే ఎవరైనా ఇసుక తెచ్చుకోవచ్చన్నారు. ఇసుక ట్రాక్టర్‌ను పోలీసులు ఎవరైనా అపితే యాక్షన్ తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్లలో సమస్య గత ప్రభుత్వ పాపమేనన్నారు. ఐదేళ్లలో గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. గుర్లలో వాటర్ కలుషితం అయ్యిందంటున్నారని.. సీనియర్ ఐఏఎస్‌తో విచారణ జరిపిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com