YS Vivekananda Reddy: వివేకా హత్యకేసులో నాపై ఎంపీ అవినాష్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు- సీఐ శంకరయ్య

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తనపై ఎంతో ఒత్తిడి తెచ్చారన్నారు అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య. అయినా తాను లొంగలేదని సీబీఐకి ఇచ్చిన వాంగూల్మంలో తెలిపారు. అవినాష్‌తో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కూడా ఒత్తిడి చేశారన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న భయంతోనే తొలుత హత్యానేరం కింద కేసు నమోదు చేయలేకపోయానని వివరించారు.
కేసు లేకుండానే.. వివేకా మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు వారు ప్రయత్నించారని చెప్పారు. అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని.. ఎర్ర గంగిరెడ్డి వివేకా వద్ద పీఎస్‌గా పనిచేశారని సీబీఐ అధికారులకు వివరించారు. వివేకాను ఎవరు హత్య చేశారో వారికి తెలుసన్నారు. వీరందరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు.
ఈమేరకు 2020 జులై 28న, గతేడాది సెప్టెంబరు 28న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఇవన్నీ తాజాగా బయటికొచ్చాయి. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రైట్ హ్యాండ్‌లా వ్యవహరిస్తారని సీఐ శంకరయ్య తెలిపారు. అవినాష్ ఆఫీసు నిర్వహణ అంతా శివశంకర్‌రెడ్డే చూసుకుంటారన్నారు. ఆయనతో పాటు ప్రచారంలో, బహిరంగ సభల్లో పాల్గొంటారన్నారు.
శివశంకర్‌రెడ్డిపై ఇప్పటికే 30కి పైగా క్రిమినల్ కేసులున్నాయన్నారు. వివేకా హత్య జరిగిన రోజు ఘటనాస్థలానికి తాను వెళ్లేసరికి శివశంకర్‌రెడ్డి అక్కడే ఉన్నారన్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తరలించేందుకు వీలుగా ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఫ్రీజర్‌ను వివేకా ఇంట్లోకి తెప్పించారన్నారు. మృతదేహాన్ని అందులోకి తరలించకుండా తాను అడ్డుకున్నట్లు తెలిపారు.
వారిద్దరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా కనిపించిందన్నారు సీఐ శంకరయ్య. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పాటు ఘటనా స్థలం వద్ద అప్పటికే భారీగా జనం గుమిగూడారన్నారు. అందుకే వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు బ్యాండేజీలు, కట్లు కడుతున్న వారిని నియంత్రించలేకపోయానని వివరించారు సీఐ శంకరయ్య. వివేకా హత్య విషయలో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రమేయంపైనా పలు అనుమానాలున్నాయి.
హత్య జరిగిన రోజు తెల్లవారుజామున వివేకా ఇంటి సమీపంలో ఉదయ్‌కుమార్‌రెడ్డి తిరుగుతున్నట్ల దర్యాప్తులో గుర్తించామని.. గతంలో పులివెందుల డీఎస్పీగా చేసిన వాసుదేవన్ సీబీఐకి తెలిపారు. ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందనే అంశంపై ప్రశ్నించగా.. ఒక్కోసారి ఒక్కోలా మాట మార్చారన్నారు. కాల్‌డేటా రికార్డుల వివరాలు, టవర్ లొకేషన్ల సమాచారం విశ్లేషించి చూస్తే.. ఉదయ్‌కుమార్‌రెడ్డి చెప్పిందంతా అబద్ధమని తేలిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com