ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
ఏపీలో వార్డు వాలంటీర్‌ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు.. ఏపీలో వార్డు వాలంటీర్‌ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.. స్థానిక పరిపాలనా వ్యవస్థను ధ్వంసం చేసే తీరులో వార్డు వాలంటీర్లను ప్రభుత్వ, వ్యక్తి ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ప్రధానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. గట్టు తగాదాల మొదలు అన్ని అంశాల్లో వార్డు వాలంటీర్ల జోక్యం గ్రామీణ జీవితాన్ని ధ్వంసం చేస్తోందన్నారు. గుడి, బడి, పోలీస్‌ స్టేషన్‌ లాంటి వ్యవస్థల్లోనూ బాధితుల పక్షం కాకుండా ప్రభుత్వ తరపు లైజన్‌ అధికారులుగా మారారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అధినేత ఫొటోలతో వేలాది వాహనాల్లో ఊరూరూ తిరుగుతూ వీరు చూపిన ప్రభావం ఇటీవల స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రభుత్వ పక్షానికి ఓటు వేయకపోతే మీకు రేషన్‌ ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్‌ చేసి ఉదంతాలు కూడా ఉన్నాయన్నారు.

ఈ పరిస్థితి కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా గ్రామాల్లో నిత్యకృత్యంగా మారిన రాజకీయ దృశ్యమని రఘురామ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏపీ గ్రామాల్లో దర్శనమిస్తున్న ఈ రాజకీయ విధేయత, పక్షపాత ధోరణి గ్రామీణ జీవన చిత్రానికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. కులతత్వం, మద్యానికి బానిసత్వం, పేదరికం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై దృష్టిసారించాల్సిన ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా వాటిని మరింత ప్రేరేపిస్తోందన్నారు ఎంపీ రఘురామ. ప్రజాధనాన్ని వృధా చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం వార్డు వాలంటీర్లను వాడుకునే దుర్మార్గపు ఆలోచనను మరో రాష్ట్రం అనుసరించకుండా మీ జోక్యం అవసరమన్నారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై స్పందించి వార్డు వాలంటీర్‌ వ్యవస్థ వంటి రాజ్యాంగేతర జోక్యాన్ని నిలువరించాలని ప్రధానికి లేఖలో విజ్ఞప్తి చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు.

Tags

Read MoreRead Less
Next Story