వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నిరసన సెగ

విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో రామతీర్థం చేరుకోనుండగా అంతకు ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేరుకున్నారు. అక్కడ విజయసాయిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన్ను రామతీర్థ భక్తులు అడ్డుకున్నారు. సీఎం జగన్ డౌన్ డౌన్ విజయసాయిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డికి కొండ మీదకు వెళ్లేందుకు అర్హత లేదని మండిపడ్డారు.
అటు రామతీర్థం ఘటనతో సంబంధం ఉందని నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులో తీసుకోగా వారి కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు బాధితుల కుటుంబ సభ్యుల్ని ఈడ్చి పడేశారు. విగ్రహం ధ్వంసం చేసినట్టు అంగీకరించమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు అని చూడకుండా వారిని పోలీసులు ఈడ్చుకెళ్లడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు విజయనగరం జిల్లాలోనూ భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని హిందూ ధార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com