ఏపీలో మళ్లీ పరిషత్ ఎన్నికల పంచాయితీ

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు కొత్త ఎస్‌ఈసీ నీలం సాహ్ని. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై ఎస్‌ఈసీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. బాధ్యతలు తీసుకోగానే సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో భేటీ అయ్యారు నీలం సాహ్ని. పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ-సీఎస్ మధ్య చర్చలు జరిగాయి. అటు ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబుతోనూ సమీక్షించారు. అనంతరం సాహ్ని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిషత్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంటపాటు కొనసాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కొనసాగిస్తూ విడుదల చేయాల్సిన ప్రకటనపై ఎస్ఈసీ.. కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రంలో ZPTC, MPTC ఎన్నికల నిర్వహణకుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులకు నీలం సాహ్నీ దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లో కోవిడ్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితులపై ఎస్ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అటు శుక్రవారం రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ సమావేశం కానున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు. పరిషత్ ఎన్నికలపై కోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో..ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ తర్జనభర్జన పడుతోంది. కోర్టు తీర్పు వచ్చాక ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామనే అంశంపై.. అధికారులతో ఎస్‌ఈసీ సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవాలను ప్రకటించాలని గతంలోనే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకగ్రీవాలనూ ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో 125 జడ్పీటీసీలు, 2వేల 248 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.
అంతకుముందు పరిషత్ ఎన్నికలకు ప్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ నేతలు కొత్త SEC నీలం సాహ్నిని కోరారు. గత ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడిందన్నది ఆమెకి వివరించారు. MPTC, ZPTC ఎన్నికల్లో ఏకగ్రీవాలు భారీగా పెరిగిన అంశాన్ని కూడా SEC దృష్టికి తీసుకెళ్లారు.
అయితే గతంలో ఆగిన చోట నుంచి ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించడానికే SEC మొగ్గుచూపడంపై తెలుగుదేశం మండిపడుతోంది..గతంలో నిమ్మగడ్డ ఉన్నప్పుడే అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని... రానున్న ఎన్నికలు కూడా ఏకపక్షంగానే జరుగుతాయని విమర్శిస్తోంది. తాజా నోటిఫికేషన్ కోసం శుక్రవారం జరిగే అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. తాజా నోటిఫికేషన్ కుదరని పక్షంలో ఎన్నికలు దూరంగా ఉండాలని భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com