MUNTHA CYCLONE: ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెుంథా తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ మెుంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలుప్రాంతాలు అల్లకల్లోలంగా మారనున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం విశాఖకు 970 కిలోమీటర్లలో కాకినాడకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. మెుంథా తుఫాన్ ఉత్తర వాయవ్యదిశగా కదులుతూ మంగళవారం రాత్రికి తుపాను తీరం దాటనుంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. గంటకు 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సోమవారం గాలుల తీవ్రత 55 నుంచి 75 కి.మీ వరకు పెరుగుతుందని భావిస్తున్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రేపు, ఎల్లుండి చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన తర్వాత .. ఉత్తర వాయవ్యదిశగా పయనించి, మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
విద్యా సంస్థలకు సెలవులు
గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో 3 రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుపాను ముప్పు, భారీ వర్షాల కురుస్తయన్న వాతావరణశాఖ ప్రకటనతో అక్టోబర్ 27, 28, 29 తేదీలలో సెలవులు ప్రకటించారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీలలో సెలవు ప్రకటించారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా కొన్ని ఇతర జిల్లాల్లోనూ సెలవులు ప్రకటిస్తున్నారు. నెల్లూరు జిల్లా లో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలకు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, జానియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు
మొంథా తుఫాను ఈనెల 28న తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురవడంతోపాటు, భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, అధికారయంత్రం అప్రమత్తమై.. శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. అయితే మొంథా ఎఫెక్ట్ ఏపీ మీదనే కాకుండా తెలంగాణ మీద కూడా తీవ్రంగా ఉండబోతోంది. ఈనెల 28న ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

