LASTRITES: వీరుడా.. వందనం

దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్‌కు యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటరై, అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తోన్న ఈ యువ కెరటం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రం వరకు దారి పొడవునా.. పూలు చల్లుతూ నివాళులు అర్పించారు.
మురళి పార్థీవదేహం దగ్గర కడసారి తల్లిదండ్రులు చేసిన సెల్యూట్ అందరికీ కన్నీళ్లు తెప్పించింది. మురళీ నాయక్ అమర్ రహే అంటూ అంత్యక్రియల ప్రాంగణం హోరెత్తింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, సవిత, అనగాని సత్య ప్రసాద్... మురళీనాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో మురళీనాయక్ పాడె మోశారు మంత్రి లోకేష్. జాతీయ జెండా చేత పట్టుకుని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఐదెకరాల పొలం, 300 గజాల ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. మురళీనాయక్ తండ్రికి ఉద్యోగం ఇస్తామని పవన్, లోకేష్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com