ఒక్క రూపాయికే ఇడ్లీ, బజ్జీ.. ఈ రోజుల్లో కూడా ఇలా..

ఉన్నారు ఎందుకు లేరు.. సొంత లాభం కొంత కూడా చూసుకోకుండా తమకు చేతనైనంతలో నలుగురికీ సాయం చేయాలనుకున్నారు. ప్లేట్ ఇడ్లీ పది రూపాయలు కూడా దొరకట్లేదు ఎక్కడా అలాంటిది రూపాయికే అందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్ బీ కొత్తూరు గ్రామానికి చెందిన చిన్న రత్నం లక్ష్మి, చిన్న రామకృష్ణ. వారి ఇంటి వాకిట్లోనే చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు. దాదాపు 16 ఏళ్ల నుంచి ఈ హోటల్ నిర్వహిస్తున్నారు.
ఉదయం 4గంటలకు ఓపెన్ చేసి 10 గంటలకు మూసేస్తారు. తరువాత మరో పనిలో బిజీ అయిపోతారు. ఎవరి మీదా ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. నలుగురి ఆకలి తీరుస్తూ చవక ధరకే బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న భార్యాభర్తలు ఊరివారి అభిమానాన్ని చూరగొంటున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తే చివరికి తృప్తి అనేది మిగలదు అనేది వారి సారాంశం. మేం కూడా సమాజానికి కొంత చేస్తున్నాం అనేది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అని అడిగిన వారికి చెబుతుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com