ఏలూరులో 340 మంది అస్వస్థత.. ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక

ఏలూరులో 340 మంది అస్వస్థత.. ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక

ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనలో జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 340 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. ప్రస్తుతం 157 మంది చికిత్స పొందుతున్నారని.. ఒకరు మరణించారని వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం 14 మందిని వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఇప్పటి వరకు 168 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180 మంది, మహిళలు 160 మంది ఉన్నారన్నారు. ఏలూరు అర్బన్‌కు చెందినవారు 307 మంది ఉన్నారని.. రూరల్‌కు చెందిన వారు 30 మంది ఉన్నారన్నారు. వీరంతా మూర్ఛ, మతి మరుపు, వాంతులు, తలనొప్పి, వెన్ను నొప్పి, నీరసంతో ఆస్పత్రిలో చేరారన్నారు.

ఈ లక్షణాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదని.. తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఏలూరు మున్సిపల్‌ వాటర్‌ పంపిణీ లేని ప్రాంతాల్లోని వారు కూడా అస్వస్థతకు గురయ్యారన్నారు. ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు బాధితులు ఉన్నారని తెలిపారు. 22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు సాధారణ స్థితినే సూచించాయని.. 52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయని వెల్లడించారు. 35 సెరిబ్రల్‌ స్పైనల్‌ ఫ్లూయిడ్‌ శాంపిళ్లను పరీక్షించగా సెల్‌ కౌంట్‌ నార్మల్‌ వచ్చిందని.. కల్చర్‌ రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. 45 మంది సీటీ స్కాన్‌ చేస్తే నార్మల్‌గానే ఉందన్నారు. 9 పాల నమూనాలను స్వీకరించామని.. ఆ ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ విశ్లేషణ కోసం హైదరాబాద్‌ సీసీఎంబీకి 10 నమూనాలను పంపించారన్నారు. ఫలితం రావాల్సి ఉందని నివేదికలో చెప్పారు.

62 గ్రామ, వార్డు సచివాలయాలు సర్వేలో పాల్గొన్నాయని.. 57వేల 863 కుటుంబాల్లో ఉన్నవారిపై ఆరోగ్య సర్వే చేశారని తెలిపారు. కుటుంబ సర్వే ద్వారా 191 మంది అస్వస్థతకు గురైనట్లు తేల్చారన్నారు. స్పెషలిస్టులతో సహా 56 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. మైక్రో బయాలజిస్ట్‌లు, 136 మంది నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓలు 117 మంది, ఎంఎన్‌ఓలు 99 మంది సేవలు అందిస్తున్నారన్నారు. 62 మెడికల్‌ క్యాంపుల నిర్వహణ చేపట్టామని.. చెప్పారు. ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రి సహా నాలుగు ఆస్పత్రుల్లో 445 బెడ్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

విజయవాడ జీజీహెచ్‌లో 50 బెడ్లు కేటాయించామన్నారు. అక్కడ 12 మంది డాక్టర్లు, 4 అంబులెన్స్‌లు, 36 మంది నర్సింగ్‌ సిబ్బంది ద్వారా సేవలు అందుతాయన్నారు. విజయవాడకు ఇప్పటివరకూ ఏడుగురిని తరలించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story