ఇంకా భయం గుప్పిట్లోనే ఏలూరు ప్రజలు

ఇంకా భయం గుప్పిట్లోనే ఏలూరు ప్రజలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నారు. అంతుచిక్కని వ్యాధితో జనం అల్లాడుతున్నారు. మూర్ఛ, వాంతులు, తలనొప్పితోఏమవుతుందో తెలియక ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. బాధితుల లక్షణాలకు అనుగుణంగా డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు వ్యాధికి గల కారణాలేంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అటు ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్‌ నివేదిక విడుదల చేశారు. ఇప్పటివరకు ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకలేదని.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని నివేదికలో తెలిపారు. బాధితులకు మూర్ఛ ఒకసారి మాత్రమే వస్తుందని.. ఇది 3 నుంచి 5 నిమిషాలపాటు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు 340 మంది అస్వస్థతకు గురయ్యారని.. ప్రస్తుతం 157 మంది వ్యాధి లక్షణాల నుంచి కోలుకున్నట్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఒకరు మృతి చెందినట్లుగా వెల్లడించారు. బాధితులకు మతిమరుపు, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉన్నాయన్నారు. మున్సిపల్‌ వాటర్‌తోపాటు మినరల్‌ వాటర్‌ తాగినవారు కూడా ఈ లక్షణాల బారిన పడినట్లు కలెక్టర్‌ నివేదికలో పేర్కొన్నారు.

మరోవైపు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు అధికారులు.. తాగునీరు, పాల శాంపిల్స్‌ను పరీక్షించగా సాధారణ స్థితిలోనే ఉందని, బాధితుల బ్లడ్‌ రిపోర్టు కూడా నార్మల్‌గానే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. 45 మందికి సీటీ స్కాన్‌ చేయగా.. ఆ రిపోర్టు కూడా సాధరణంగా ఉండటంతో ఏం జరిగిందో అర్థంకాక అయోమయంలో ఉండిపోయారు. ఎలాంటి పరిస్థితైనా ఎదుర్కొనేందుకు అత్యవసరంగా వైద్య సిబ్బందిని, మెడికల్‌ క్యాంపులను అందుబాటులో ఉంచారు. ఇక కేంద్రం కూడా అత్యవసరంగా వైద్య బృందాన్ని ఏలూరు పంపనుంది.. మంగళవారం ఏలూరులో పర్యటించనున్న కేంద్ర బృందం అసలేం జరిగిందో విచారణ చేపట్టనుంది.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జంషెడ్‌ నాయర్‌, డాక్టర్‌ అవినాష్‌ డియోష్టవర్‌, డాక్టర్‌ సంకేత్‌ కులకర్ణి విచారణ జరిపి కేంద్రానికి నివేదిక పంపనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రోగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించింది. అలాగే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ నుంచి రెండు సైన్టిస్ట్‌ బృందాలు ఏలూరులో పర్యటించనున్నాయి.

ముఖ్యమంత్రి జగన్‌ ఏలూరు వెళ్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అయితే, ఈ పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.. ప్రజారోగ్యంపై ఈప్రభుత్వానికి శ్రద్ధ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏలూరు ఘటనపైసమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. ప్రజలంతా భయపడుతున్నా ఎందుకు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరోవైపు ఏలూరులో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్‌కు నారా లోకేష్‌ లేఖ రాశారు.. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగానే ఉందని లేఖలో పేర్కొన్నారు.. అత్యవసర పరిస్థితిగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుత ఏలూరు ఘటన మానవ విషాదంగా మారకుండా ఎలా నియంత్రించాలో అధికారులకు తెలియదన్నారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టకుండా మాస్‌ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టిపెట్టిందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో లోకేష్‌ పేర్కొన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, దోమల మందు కారణమై ఉంటుందా అనే కోణంలో వైద్యాధికారులు ఆలోచన చేస్తున్నారు.. ఆర్గానో క్లోరినో అనే రసాయనం కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే నమూనాలు ల్యాబ్‌కు పంపగా.. వాటి ఫలితాలు వచ్చిన తర్వాతే ఏం జరిగిందన్నది తెలిసే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story