పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం

పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం
పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి 18 మంది అస్వస్థతకు గురయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ వింత వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఏలూరు సమీపంలో కొందరిలో ఈ తరహా లక్షణాలు బయటపడ్డాయి. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఉన్నట్టుండి 18 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే వైద్యసిబ్బంది అప్రమత్తమై వారందరికీ చికిత్స అందిస్తున్నారు. వీళ్లందరిలోనూ ఉన్నట్టుండి స్ఫృత తప్పడం, ఫిట్స్‌ వంటి లక్షణాలు గుర్తించారు.

ప్రస్తుతం బాధితులంతా కోలుకున్నా వాళ్ల అనారోగ్యానికి కారణాలేంటో వైద్యులకు అంతుపట్టడం లేదు. వీరి రక్తనమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కి పంపించారు. అలాగే తాగునీటి నమూనాలను కూడా పరీక్షకు పంపారు. DMHO కూడా తాజా పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఇంటింటి సర్వే చేపట్టి.. స్థానికుల ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

గత నెలలలో ఏలూరును వింతవ్యాధి వణికించింది. నుంచున్న వాళ్లు నుంచున్నట్టే కళ్లు తిరిగిపడిపోయారు. నోటి నుంచి నురగలు కక్కుతూ అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 600 మంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ రోగానికి తాగునీరు కారణమా, కూరగాయలు వంటి వాటి నుంచి విషపూరిత పదార్థాలు ఆహారంలోకి చేరాయా అనే దానిపై అనేక పరీక్షలు చేసినా పూర్తి స్పష్టత రాలేదు.

ఇక ఇప్పుడు ఏలూరుకు 30 కిలోమీటర్ల దూరంలోని భీమడోలు మండలంలోని పూళ్ల గ్రామంలో 2 రోజులుగా ఇలాంటి కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించిన DMHO సునంద.. వారికి ధైర్యం చెప్పారు.

వింతవ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వారిని డిశ్చార్జ్ చేసేముందు వారి రక్తనమూనాలు సేకరించారు. వాటిని ఏలూరు ల్యాబ్‌కి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story