DRONE SUMMIT: విజయవాడలో డ్రోన్ సమ్మిట్

ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు .
భారీ ప్రైజ్ మనీ
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను ఈనెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్ చెప్పారు. 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని, ముఖ్యఅతిథిగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. ఏపీని డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన 5 వేల డ్రోన్‌లతో హ్యాకథాన్‌ను కృష్ణా నదీ తీరంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రోన్ హ్యాకథాన్‌లో పాల్గొన్న వారికి మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండవ బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష చెల్లిస్తామని ప్రకటించారు. డ్రోన్ సమ్మిట్, డ్రోన్ హ్యాకథాన్ లోగోలు, వెబ్‌సైట్‌లను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు.
చర్చ వీటిపైనే..
డ్రోన్ సాంకేతికలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలు, రోజువారీ జీవితంలో, అడ్మినిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి డ్రోన్స్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై ఈ సదస్సులో చర్చ జరగనుంది. డ్రోన్ అప్లికేషన్స్‌కు సంబంధించి ఏం చేయాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందించనున్నారు. డ్రోన్ ద్వారా ఒక వీడియో రికార్డు చేసినప్పుడు దాని అనలిటికల్స్ ఇప్పుడు సరిగ్గా ఎక్కడా చేయడం లేదని ఈ అంశాన్నిపై కూడా మాట్లాడనున్నారు. వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎంత మేర నీరు ఉంది, నీటి లోపల ఏముంది, ఎంత మంది చిక్కుకు పోయారు, పురుషులెందరు, మహిళ, చిన్నారు ఎంత మంది ఉన్నారోలాంటి విశ్లేషణ సామర్థ్యం అందుబాటులోకి రాలేదు. ఇలాంటి సమస్యలపై ముంబయి, మద్రాస్, తిరుపతి ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో డ్రోన్ కార్పొరేషన్ అధ్యయనం చేసి ఒక పరిష్కారం తీసుకొచ్చే దిశగా పని చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com