Nallari Kishore Kumar Reddy: చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి అవసరమా: నల్లారి కామెంట్

Nallari Kishore Kumar Reddy: చెల్లికి న్యాయం చేయలేని సీఎం రాష్ట్రానికి అవసరమా: నల్లారి కామెంట్
Nallari Kishore Kumar Reddy: వైఎస్ వివేకా హత్యకేసులో సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి.

Nallari Kishore Kumar Reddy: వైఎస్ వివేకా హత్యకేసులో సొంత చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి. వివేకాను ఎవరు చంపారో వైఎస్‌ షర్మిలకు తెలుసని, అందుకే వివేకా హత్యకేసు దర్యాప్తును అడ్డుకోవద్దని అంటున్నారని కామెంట్ చేశారు.

జగన్ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలుసుకోవడం మంచి పరిణామమేనని చెప్పుకొచ్చారు నల్లారి కిషోర్ కుమార్‌. ఇద్దరు నేతలు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు- పవన్ కలవడంతో వైసీపీకి భయం పట్టుకుందని కామెంట్ చేశారు.

వైఎస్‌ వివేకా హంతకులకు శిక్షపడితేనే వైఎస్ సునీత రెడ్డికి న్యాయం జరుగుతుందన్నారు వైఎస్ షర్మిల. చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులు ఎవరనేది తప్పకుండా తేలాలన్నారు షర్మిల. వివేకా హత్య తన కుటుంబంలో జరిగిన ఘోరమైన ఘటన అని, దోషులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.


సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు షర్మిల. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదేనన్నారు. హత్యకేసు దర్యాప్తును ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదన్నారు షర్మిల. ఒకవేళ హత్య వెనక రాజకీయ కారణాలు ఉంటే.. సీబీఐ దర్యాప్తులో తేలుతాయన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. నిందితులను రక్షించే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతోంది. దీని వెనక ఉన్నది స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ అనే విమర్శలు సైతం అంతే బలంగా వినిపిస్తున్నాయి. వైఎస్‌ వివేకా కూతురు సునీత దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని కీలక అంశాలు జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేవిగా ఉన్నాయి.


వైఎస్‌ వివేకాను ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఎందుకు హత్య చేస్తారు అంటూ స్వయానా ముఖ్యమంత్రే స్టేట్‌మెంట్ ఇచ్చిన తరువాత.. రాష్ట్ర యంత్రాంగం స్వేచ్ఛగా ఎలా పని చేస్తుందన్నది ప్రధాన ప్రశ్న. రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీబీఐపై ఆరోపణలు చేస్తూ అవినాశ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డిని సమర్ధిస్తే.. ఇక అధికార యంత్రాంగం గాని, పోలీసులు గాని ఎలా స్వతంత్రంగా పనిచేస్తారన్నది మరో ప్రధాన ప్రశ్న. మొత్తంగా వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగకపోవడానికి సోదరుడైన సీఎం జగనే అడ్డంకి అని చెప్పకనే చెప్పారు వైఎస్ సునీత.

Tags

Read MoreRead Less
Next Story