నందమూరి తారకరామారావు శత జయంతి స్పెషల్

నందమూరి తారకరామారావు శత జయంతి స్పెషల్
తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమై నినదించిన నందమూరి తారకరామారావు జయంతి స్పెషల్..

1932 వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు. మొట్టమొదటి తెలుగు చలనచిత్రం ’భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు. అప్పటికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లవాడొకడు తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమౌతున్న సంగతి అతనికి అప్పుడు తెలియదు. కాలంతో పరిగెడుతూ పిల్లవాడు యువకుడయ్యాడు. కాలేజీ చదువు, నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. ఈలోగా కాలం ఇంకాస్త ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు ఇనస్పెక్టరు పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడనుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజలగుండెలవైపు వేగంగా వచ్చాడు.. తన అసమాన నటనా కౌశలంతోను తెలుగు సినీ సార్వభౌముడయ్యాడు. తెలుగు వారి కృష్ణుడుగా, సినిమా దేవుడుగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు. ఇవాళ ఈ మహానటనాయకుడి జయంతి.

నందమూరి తారకరామారావు. ఈ పేరు తలుచుకోగానే ఆయన నిండైన విగ్రహం కనిపిస్తుంది. అందగాడు.. ఆజాను భాహుడు.. మల్లీశ్వరిలో నాగరాజు గా సమ్మోహనపరిచి.. తోటరాముడిలా తెలుగు చిత్ర సీమలో పాగా వేసి.. అఖిలాంధ్రప్రేక్షకుల చేత చంద్రహారం వేయించుకున్న నటుడు ఎన్టీఆర్. ఎన్నో తరాలను ప్రభావితం చేసిన నటుడిగా సమ్మోహనశక్తిగా తెలుగుతెర, భాషా ఉన్నంత కాలం ఉంటాడు.

పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. ఆహార్యం, ఆంగిక, వాచకాభినయాలకు ఆయన నటనే ఓ పాఠశాల.

ఎన్టీఆర్ మహానటుడే.. ఎవరు కాదనగలరు. మరి అలాంటి నటుడు ఎంచుకునే పాత్రలు ఏ స్థాయిలో ఉంటాయి. ప్రేక్షకుల్లో తనపై ఉన్న అభిమానానికి ఇంకా చెప్పాలంటే వారిచ్చిన ఇమేజ్ కు అనుగుణంగా ఉండాలి కదా.. కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పాత్రకు తగ్గట్టుగా ఇమేజ్ ను పక్కన బెట్టారు. దేవుడుగా చేసిన ఆయనే విలన్ గా చేసి మెప్పించారు.. అయితే ఎంతో ఇమేజ్ ఉన్న ఆయన ఆ పాత్రలు చేయడం నర్తనశాలలో బృహన్నలగా చేయడం వేరు.. కాదంటారా?

ఎన్టీఆర్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, నిర్మాత, దర్శకుడు, కథారచయిత, రాజకీయవేత్త... అయినా అడుగు పెట్టిన అన్ని రంగాల్లో విజయ దుందుభి మోగించిన ఏకైక నటుడు, రాజకీయ వేత్త ఆయన. ఇలాంటి పర్సనాలిటీ ప్రపంచంలో మరొకరున్నారో లేదో తెలియదు కానీ, ఉన్నా .. వారు ఎన్టీఆర్ తర్వాతే అవుతారని ప్రతి తెలుగు వాడూ ఘంటాపథంగా చెబుతాడు.

Tags

Read MoreRead Less
Next Story