Nandyal: పులిపిల్లలను తల్లి వద్దకు చేరుస్తాం: అధికారులు

Nandyal: పులిపిల్లలను తల్లి వద్దకు చేరుస్తాం: అధికారులు
పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్న అధికారులు

నిన్న నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులోని ఓ గోడౌన్‌లో కనిపించిన పులి పిల్లలపై అటవీ శాఖ స్పందించింది. ఆ నాలుగు ఆడ పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పిల్లల కోసం తల్లి పులి వచ్చి దాడి చేస్తుందని పెద్దగుమ్మడాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇక స్థానికుల సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది పెద్దగుమ్మడాపురం చేరుకుని నాలుగు పులి పిల్లలను పరిశీలించారు. సుమారు 40రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అడవిలోకి తీసుకువెళ్లి తల్లితో కలిపేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు అడవిలో తిరిగినా తల్లి కనిపించలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పులిపిల్లలు డీలా పడిపోయాయాయి. దీంతో వాటికి పాలు పట్టించి బైర్లూటి రేంజ్‌లో ఉన్న జంతువైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షలు చేసి నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించారు.అటవీ ప్రాంతంలో ఎండ పెరగడం, చెట్లకు మంట పెడుతుండటంతో వేడి తీవ్రత తట్టుకోలేక గ్రామంలోకి పెద్దపులి తన పిల్లలను తీసుకువచ్చి, ఒంటరిగా తిరిగి వెళ్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

గ్రామస్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని, పులి రాకను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పెద్ద పులికి రెండు, మూడు పిల్లలే పుడతాయని, అయితే నాలుగు ఆడ పులి పిల్లలు పుట్టడం చాలా అరుదని అధికారులు తెలిపారు. పులి పిల్లలు దొరికిన సమీపంలోనే చిన్న ఎన్‌క్లోజర్‌లో వాటిని ఉంచి దూరం నుంచి తల్లి వస్తుందో.. లేదో.. అని గమనిస్తున్నట్లు తెలిపారు. చుట్టూ 50 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల వాసన, అరుపులను బట్టి తల్లి వస్తుందని భావిస్తున్నామని, వస్తే వాటిని దానికి జత చేస్తామన్నారు. ఐతే 24 గంటలు గడిచినా తల్లి పులి జాడ లేదు. దీంతో అధికారులు ఒకటి, రెండు రోజులు చూసిన తర్వాత కూడా తల్లి రాకపోతే వాటిని తిరుపతి జూకు తరలించి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఆ కూనలు సంరక్షణ కోసం తిరుపతి వన్య ప్రాణి బృందం ఆత్మకూరు రానుంది. అయితే గ్రామానికి దగ్గర్లోనే తల్లి పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నామని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. పులి పిల్లలు లభించిన ప్రాంతంలోనే తల్లి పులి తిరుగుతున్నట్లు దాని గాండ్రిపులతో అటవీ సిబ్బంది గుర్తించారు. ఈ సాయంత్రం లేదా రాత్రికి తల్లి,పిల్లలను కలిపే ప్రయత్నం చేస్తామంటున్నారు ఫారెస్ట్ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story