పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి ప్రారంభం : చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి ప్రారంభం మాత్రమేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినా.. బెదిరింపులకు దిగినా ప్రజలు టీడీపీ వెనుక నిలబడ్డారని అన్నారు. ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉందని తెలిపారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకున్నారా.. జ్ఞానోదయం అయిందా అంటూ చురకలంటించారు చంద్రబాబు.
వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులను 150కు పైగా ఆలయాలపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, కండబలంతో రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, దళితులపై దాడికి దిగారని ఫైరయ్యారు చంద్రబాబు. వైసీపీ దుర్మార్గాలను ఎదిరించిన ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు చంద్రబాబు.
పుంగనూరు, తబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 174 అక్రమ కేసులు పెడితే 414 బలవంతంగా నామినేషన్లు ఉపసంహరణలు చేశారన్నారు. 33చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. ఇద్దరిని హత్య చేశారని.. 23మందిపై హత్యాయత్నాలు, 61దాడులు, 42 కిడ్నాపులు, 92చోట్ల బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. ప్రతి ఒక్కరినీ న్యాయస్థానం బోనులో నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు.
తొలిదశ ఎన్నికల్లో 94శాతం గెలిచామని ఓ మంత్రి గాలికబుర్లు చెప్పారని.. గెలుపోటములు సహజమని జ్ఞానోదయం అయినట్లుగా విజయసాయి ట్వీట్ చేశారన్నారు చంద్రబాబు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని.. పంచాయితీ ఎన్నికల్ని రణరంగంగా మార్చారని మండిపడ్డారు. ఐఏఎస్‌లను బ్లాక్‌లిస్టులో పెడతానని మంత్రి పెద్ది రెడ్డి చెపుతారా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఎన్నికల్లో ప్రతి అక్రమం పై కేసులు వేస్తామని.. కుప్పంలో ఏకగ్రీవాల కోసం గట్టి ప్రయత్నం చేశారని ఆరోపించారు. గెలిచిన పంచాయతీల్లో చాలా చోట్ల ఫలితం తారుమారు చేశారని ఆరోపించారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com