Nara Lokesh : అనంతపురంలో హోరెత్తుతోన్న యువగళం పాదయాత్ర

Nara Lokesh : అనంతపురంలో హోరెత్తుతోన్న యువగళం పాదయాత్ర
జగన్ పాలనలో దగా పడిన రైతులు, మహిళలు, వృద్ధులు, యువత.. అన్ని వర్గాల ప్రజలు మేముసైతం అంటూ యువనేత వెంట సైన్యంలా పోటెత్తుతున్నారు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో యువగళం హోరెత్తుతోంది. తాడిపత్రి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర జన ప్రభంజనమై కదులుతోంది. ఊరు వాడ జన ఉప్పెనై కదం తొక్కుతోంది. తాడిపత్రిలో యువనేత ఎంట్రీ ఇచ్చిన మొదలు.. దారిపొడువునా.. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చి టీడీపీకి జైకొడుతున్నారు. లోకేష్‌తో కలిసి అడుగులో అడుగేసుకుంటూ జన ప్రవాహమై ఉత్సాహంగా నడుస్తున్నారు.


జగన్ పాలనలో దగా పడిన రైతులు, అక్కాచెల్లెమ్మలు, వృద్ధులు, యువత.. ఇలా అన్ని వర్గాల ప్రజలు మేముసైతం అంటూ యువనేత వెంట సైన్యంలా పోటెత్తుతున్నారు. పల్లె పల్లెన తెలుగుదేశం జెండా ఎగిరిపడుతోంది. టీడీపీనే తమకు అండా దండా.. తమ బతుకులకు భరోసా అంటూ లోకేష్‌తో చేతులు కలుపుతున్నారు. పల్లెలు యువనేతను ఆత్మీయంగా పలకరిస్తుంటే.. రహదారులన్నీ కిక్కిరిసిన జనంతో సంద్రాన్ని తలపిస్తోంది. దారి పొడువునా ఆ వర్గం.. ఈ వర్గం అనే తేడా లేకుండా లోకేష్‌కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు.


68వ రోజు నారా లోకేష్ యువగళం.. పెద్దపప్పూరు మండలం పసలూరు నుండి ప్రారంభమైంది. కమ్మవారిపల్లిలో యువనేతను నిరుద్యోగులు కలిసారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మోసపూరిత హామీని, ఏటా జాబ్ క్యాలెండర్‌ను నమ్మి మోసపోయామని తమ బాధను లోకేష్‌కు చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఏపీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నామని చెప్పారు. యువత సమస్యలను విన్న నారా లోకేష్.. జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతియేటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఓట్లు వేయించుకుని యువతను జగన్‌రెడ్డి మోసం చేసారని ఆరోపించారు. టీడీపీ పాలనలో యువతకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసామని, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయంఉపాధి రంగాల్లో యువతకు మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు వలసపోయిన యువతను తిరిగి ఏపీకి వచ్చేలా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.


అటు నగరూరు గ్రామంలో స్థానిక ప్రజలు, రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. తమ గోడును చెప్పుకునేందుకు స్థానిక మహిళలు, రైతులు, యువత భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా రైతులు తమ సమస్యలను లోకేష్‌కు ఏకరుపెట్టారు. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు కూడా తమ సమస్యలను లోకేష్‌కు వివరించారు. నకిలీ విత్తనాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు విన్న నారా లోకేష్.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Next Story