Nara lokesh: విజయవంతంగా ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
జన జైత్రయాత్రను తలపిస్తూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. పాదయాత్ర చివరి రోజు ప్రజలు, మహిళలు.... పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు బ్రహ్మరథం పట్టారు. పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహంతో గాజువాక దద్దరిల్లింది. వేలాది మంది జనసంద్రం మధ్య శివాజీనగర్ వద్ద లోకేష్ పైలాన్‌ను ఆవిష్కరించారు.
అణిచివేతకు గురైన వర్గాల గొంతుకే...యువగళం అంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైలాన్ వద్ద తన సందేశాన్ని ఇచ్చారు. ప్రజాగళమై, ప్రజలే బలమై... 226 రోజులు, 3వేల132 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందని గుర్తు చేశారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడిని..., వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూశానని లోకేష్ చెప్పారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాననే విశ్వాసం వ్యక్తపరిచారు. అందరి సహకారంతో యువగళం పాదయాత్రను విజయవంతంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నన్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
గతంలో చంద్రబాబుచేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రనూ ముగించారు. ఈ సందర్భంగా జైలోకేష్, జైతెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఉదయం C.W.C-1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేష్‌తో తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరుపేరునా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com