Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం
మగ్ర విచారణకు లోకేశ్ ఆదేశం

వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుబడిన గంజాయిపై సమగ్ర విచారణ జరపాలని ఆధికారులను ఆదేశించారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి బారిన పడుతున్న తమ పిల్లలకు కాపాడాలని, ట్రిపుల్‌ ఐటీలో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేయాలని తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు లోకేశ్​కు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తమ పిల్లల్ని పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ చేర్పించి తీవ్రంగా నష్టపోతున్నామంటూ తల్లిదండ్రులు ప్రజా దర్బార్​లో నారా లోకేశ్​ని కలిసి వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

తక్షణమే స్పందించిన మంత్రి సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను నారా లోకేశ్ ఆదేశించారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, క్యాంపస్​లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మార్కులు పరంగా ఫెయిల్ అవుతున్నారని కూడా తెలిపారు. పదో తరగతిలో 90 శాతంపైగా మార్కులు సాధించిన తమ పిల్లలకు ఇంటర్​లో సిబ్బంది ఇంటర్నల్ మార్క్స్ విషయంలో నిర్లక్ష్యం వహించి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. లోపభూయిష్టంగా తయారైన పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీపై దృష్టి సారించి తమ విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఏపీ-తెలంగాణ రాష్ట్రాల తల్లిదండ్రులు కోరారు. సమస్యను తప్పక పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని లోకేశ్ హామీ ఇచ్చారు.

అసలేం జరిగింది : వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థుల వద్ద భద్రతా సిబ్బంది గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఈ నెల 3న కడపకు వెళ్లి అదే రోజు రాత్రి ట్రిపుల్‌ ఐటీకి తిరిగొచ్చారు. వారిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా గంజాయి, సిగరెట్‌ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దీనిపై వారు వర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు. స్పందించిన ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కుమారస్వామి గుప్తా, ఏవో రవికుమార్, ఇతర కోర్‌కమిటీ సభ్యులు విద్యార్థులను మందలించి, వారి తల్లిదండ్రులను క్యాంపస్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Tags

Next Story