రైతులు, పేదల మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌

రైతులు, పేదల మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌

అమరావతి రైతులు ఆవేదన అంతు లేనిది. రాజధానికి భూములిచ్చి చిత్రహింసలకు గురవుతున్న తీరు అందర్నీ కదిలిస్తోంది. రాజధానికి భూములిచ్చినందుకు మహిళలని చూడకుండా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించారని.. కేసులు పెట్టారని అమరావతి రైతులు, కూలీలు, మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. భూములివ్వడమే తాము చేసిన తప్పా అని వాపోయారు. కౌలు ఇవ్వడం లేదు.. పిల్లలకు చదువులు లేవు.. జగన్‌ వచ్చాక చిన్నచిన్న వ్యాపారాలూ నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా తాడికొండ నియోజకవర్గ పరిధిలోని రావెలలో నిర్వహించిన అమరావతి ఆవేదన కార్యక్రమంలో.. అమరావతి రైతులు తమ గోడు చెప్పారు. రాజధానికి భూములిచ్చారనే అక్కసుతో తమపై రాక్షసంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన తమను పోలీసులు తీవ్రంగా హింసించారని, వేలాది కేసులు పెట్టి జైలు పాలుచేశారని వివరించారు. రాజధాని అభివృద్ధి అవుతుందని భూములిస్తే.. మూడు రాజధానులంటూ ఈ ప్రభుత్వం తమతో ఆడుకుంటోందంటూ రైతులు కన్నీటిపర్యంతం అయ్యారు.

రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, జగన్‌తో నేను మాట్లాడతా అని చెప్పిన వ్యక్తి అసెంబ్లీలో మూడు రాజధానులకు అనుకూలంగా చప్పట్లు కొట్టారన్నారు. రిజర్వ్‌ జోన్‌ను రద్దు చేస్తామని కరకట్ట కమల్‌హసన్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాగ్దానం చేసి మర్చి పోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రిజర్వ్‌ జోన్‌ రద్దు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 41ను మళ్లీ అమలు చేసి, అసైన్డ్‌ రైతులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. అమరావతి ఏ విధంగా కమ్మరావతి అవుతుందని లోకేశ్‌ మండిపడ్డారు. అమరావతి ప్రజల రాజధాని అని, ఆరు ఎస్సీ నియోజకవర్గాలు రాజధాని చుట్టు ఉన్నాయని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసం కుల ముద్ర వేశారన్నారు. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు అంటూ చిచ్చుపెడుతున్నారన్నారు. ఆర్‌-3 జోన్‌లో ఇళ్ల స్థలాలకు ఇచ్చే భూమి ఉన్నా లిటిగేషన్‌ ఉన్న భూములను ఇవ్వాలని చూస్తున్నారన్నారు. అధికారం చేపట్టిన తరువాత మంగళగిరి వాళ్లకు మంగళగిరిలో, తాడికొండ వాళ్లకు తాడికొండలో ఇళ్లు కట్టిస్తామని, రాజధాని నిర్మాణం పనులు ఆగిన చోటునుంచే మళ్లీ ప్రారంభిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story