Nara Lokesh: కేసులు, దాడులకు భయపడే రోజులు పోయాయి : లోకేష్

Nara Lokesh: కేసులు, దాడులకు భయపడే రోజులు పోయాయన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఇప్పటికే 11 కేసులు పెట్టారని... ఇంకో పదకొండు పెట్టుకోమన్నారు. అక్రమ కేసులు పెడుతున్న వారికి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు లోకేష్. కుప్పంలో ఓటడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా జగన్ రెడ్డి ఏనాడైనా కుప్పం వచ్చారా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి కుప్పం ఓట్లు కావాలి కాని కుప్పం ప్రజలు కాదన్నారు లోకేష్.
కుప్పంలో దొంగలు, రౌడీలు, స్మగ్లర్లు దిగారని ఆరోపించారు లోకేష్. ఎంత మంది అక్రమార్కులు వచ్చినా... కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్ధంగా లేరన్నారు. కుప్పం ఎన్నికలు ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినవన్నారు లోకేష్. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో దొంగదారిన ఒక వార్దును వైసీపీ ఏకగ్రీవం చేసుకుందన్నారు. మిగిలిన అన్ని వార్డులు క్లీన్ స్వీప్ చేసి జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు లోకేష్.
లోకేష్ కుప్పం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీపురం ఏరియాలో నారా లోకేష్ పర్యటిస్తున్న సమయంలోనే వైసీపీ అభ్యర్ధి సైతం ప్రచారానికి వచ్చారు. నారా లోకేష్, టీడీపీ నేతలు కనిపించడంతో ప్రచార రథం సౌండ్ పెంచి, చిందులు వేశారు వైసీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీ సంయమనం పాటించడంతో ఎలాంటి గొడవ లేకుండానే రెండు పార్టీల ప్రచారాల సాగిపోయాయి. మరోవైపు లోకేష్ ప్రచారంలో టీడీపీ నేతలు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుప్పం చుట్టు పక్కల ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి టీడీపీ శ్రేణులను వెనక్కి పంచారు.
ఉదయం మొదలైన లోకేష్ కుప్పం ప్రచారం రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాగింది. జోరువానలో తడుస్తూనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోకేష్ రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com