దళిత యువకుడు అజయ్ ని కొట్టి చంపేశారు : నారా లోకేశ్

విజయవాడలో SEB అదుపులో ఉన్న అజయ్ కుమార్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ ధ్యాన చంద్ర వివరాలు సేకరిస్తున్నారు. మొదట మార్చురీ దగ్గరకు వెళ్లిన ఆయన.. ఘటనపై ఆరా తీశారు. మృతుడు అజయ్ తల్లి, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అటు..ఏపీలో దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండ పరాకాష్టకు చేరిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. విచారణ అని పిలిచి విజయవాడలోని కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్‌ను కొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతిచెందాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వాస్తవాలు బయటపడతాయనే భయంతో కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారని ఆరోపించారు. దుర్గగుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కొట్టి చంపారని గుర్తు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డొచ్చాడని వరప్రసాద్‌కి పోలీస్ స్టేషన్‌లో శిరోముండనం చేశారని.. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్‌ని బలి తీసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.
మరోవైపు.. అజయ్ అనుమానాస్పద మృతిలో కొత్త కోణం వెలులుగోకి వచ్చింది. విజయవాడకు చెందిన సందీప్ దగ్గర రెండేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న అజయ్.. హైదరాబాద్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు వచ్చినప్పుడు.. పార్సిల్ తీసుకురావాలని సందీప్ చెప్పినట్టు తెలుస్తోంది. పార్శిల్ తీసుకెళ్తున్న క్రమంలో నిడమానూరులో అజయ్‌ను పోలీసులు పట్టుకున్నారు. తరువాత SEB ఆఫీసుకు తరలించగా.. లాకప్‌లో ఉన్నప్పుడే మూర్చ, గుండెనొప్పితో ఇబ్బంది పడుతున్న అజయ్ మృతి చెందినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com