Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి యువగళంను మళ్లీ ప్రారంభించనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలోనే ముగించాలని భావిస్తున్నారు.సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో లోకేష్ పాదయాత్ర ఆగింది. అక్కడి నుంచే తిరిగి యువగళంను ప్రారంభించనున్నారు. రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడ పాదయాత్ర ముగిస్తారని తెలుస్తోంది.

చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలతో రెండున్నర నెలల పాటూ లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఎన్నికలు మరింత దగ్గరపడుతుండటంతో.. ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకున్నారట. అందుకే పాదయాత్రను విశాఖపట్నంలో ముగించనున్నారు. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంటు కూడా కలిసి వస్తుందని.. అందుకే విశాఖలో పాదయాత్ర ముగించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.. అందుకు తగిన విధంగా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే విశాఖతో కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పాదయాత్ర కొనసాగించాలని ఆ జిల్లాల నేతలు కోరుతున్నారు. కొన్ని నియోజకవర్గాలనైనా కొనసాగించేలా యువగళం ప్లాన్ చేయాలని కోరుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

పాదయాత్రకు విరామం ప్రకటించే నాటికి లోకేష్ 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు నడిచారు. 9 ఉమ్మడి జిల్లాల్లోని 84 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగింది. పాదయాత్ర సాగిన 84 నియోజకవర్గాల పరిధిలో 66 చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. యువత, మహిళలు, రైతులు, ముస్లింలు.. ఇలా వివిధ వర్గాలతో లోకేష్ 11 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story