కొడాలి నాని క్రిస్టియన్ ముఖ్యమంత్రి దారిలో పడిపోయారు : ఎంపీ రఘురామకృష్ణరాజు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. విగ్రహాలు విరిగిపోతే ఏమిటని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హిందువుల మనోభావాలకు ఇబ్బంది కలిగేలా కేబినెట్ మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. కొడాలి నాని క్రిస్టియన్ ముఖ్యమంత్రి దారిలో పడిపోయారని వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి డబ్బుపై కన్ను వేశారని అందరూ అనుకుంటున్నారని రఘురామ పేర్కొన్నారు. రథం తగలబడితే జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి సొమ్ములు ఇవ్వడం లేదు కదా... ప్రజల డబ్బులే కదా అన్నారు. అమ్మవారి వెండిపోతే పోయిందనడం మంచిది కాదని హితవు పలికారు. దేవుడి సొమ్ము కొట్టేసినవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదని ఘాటుగా అన్నారు రఘురామ కృష్ణరాజు.
వైసీపీ అమరావతి సిద్ధాంతం...మూడు రాజధానుల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలన్నారు రఘురామకృష్ణరాజు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదని... రాష్ట్ర సమస్య అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి మగాడు అనుకున్నా... కానీ కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని ఆయన అన్నారు. గతంలో అత్తారింటికి దారేది అన్న పవన్ కళ్యాణ్ నేడు.. .అమరావతికి దారేది అని ముందుకు వస్తున్నారని రఘురామ తెలిపారు. గతంలో ఆయన రైతుల తరపున పోరాటం చేశారని గుర్తు చేశారు. జీఎస్టీ బకాయిలపై కాకుండా ఇతర అంశాలపై మా ఎంపీలు పోరాటం చేస్తున్నారని రఘురామ ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com