AP: ఒక్క పైసా భారం లేకుండా అమరావతి నిర్మాణం

ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేశాక.. ఆ భూమి అమ్మి అప్పులు తీరుస్తామని నారాయణ వెల్లడించారు. వచ్చే నెల నుంచి అమరావతి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తామని తెలిపారు. ఏప్రిల్ ప్రధాని మోదీ ఈ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని తప్పనిసరని... కానీ ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ. 43,000 కోట్ల టెండర్లు పిలిచామని గుర్తు చేశారు. అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణం దాదాపు పూర్తయిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పనులు పూర్తిగా ఆగిపోయాయని మంత్రి నారాయణ ఆరోపించారు.
ఉగాదికి అమరావతిలో "పీ4" ప్రారంభం
పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని.. సమావేశంలో వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్న చంద్రబాబు.. సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే దీని లక్ష్యమని తెలిపారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సమస్యలు ఎదురైనట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించామని నారాయణ తెలిపారు. పని వేగం పెంచేలా చర్యలు తీసుకున్నామని... ఇప్పటివరకు 90% పనులకు టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మిగతా పనులను వేగంగా పూర్తి చేసి, అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని... ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం గల ఈ భారీ స్టేడియం అమరావతిలోని 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ భాగంగా నిర్మితమవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంతో సమానంగా ఉండే ఈ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో మరో ఘట్టాన్ని ప్రారంభించనుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com