YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన అల్లుడు రాజశేఖర్ రెడ్డి..

YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాల్లో పలువరి స్టేట్‌మెంట్ ఒకే విధంగా ఉంటున్నాయి. తాజాగా వైఎస్ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్మూలం బయటకు వచ్చింది. ఎన్నికల్లో గెలిచేందుకు జగనే.. వైఎస్ వివేకా హత్యకు పథక రచన చేసి ఉంటారన్నది తన అభిప్రాయమని వాంగ్మూలంలో సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
'వివేకా హత్యలో కుటుంబసభ్యుల ప్రమేయం ఉందని మొదట్లో తాము అనుకోలేదని, అప్పట్లోనే అనుమానించి ఉంటే 2019 ఎన్నికల్లో జగన్, అవినాష్‌రెడ్డి ఓడిపోయేవారని రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. '2019 మార్చి 23న తన సునీతతో కలిసి ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ పోలీసుస్టేషన్‌కు బయలుదేరుతుండగా, తమ ఇంటికి వైఎస్ భారతి, విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారన్నారు.
వివేకా హత్యకు సంబంధించి తాము ఏం చేసినా సజ్జలకు చెప్పాలని భారతి సూచించారని పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన రోజు.. జగన్ హైదరాబాద్ నుంచి సాయంత్రానికి పులివెందుల చేరుకుని, మీడియాతో ఏం మాట్లాడాలో సజ్జలతో చర్చించారని రాజశేఖర్ రెడ్డి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అప్పటికీ వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ.. పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదన్నారు.
జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆ లేఖ గురించి ప్రస్తావించారని, . వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ మాట్లాడటం తమకు నచ్చలేదని, అదే విషయాన్ని ఆ తర్వాత జగన్‌కు చెప్పినట్లు రాజశేఖర్‌రెడ్డి వెల్లడించారు. '2019 మార్చి 15న తాను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులకు చెప్పారు.
వివేకా గుండెపోటుతో చనిపోయి ఉంటారని, మంచం మీద నుంచి కింద పడటం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయని తాను అన్నట్టుగా సీఐ స్టేట్‌మెంట్ రాశారని, అది నిజం కాదని పేర్కొన్నారు. 2019 మార్చి 29న పులివెందుల ఎస్‌డీపీవో నాగరాజాకి తానుమరో స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారని, అదీ కూడా సృష్టించిందేనని వెల్లడించారు.
2019 మార్చి 15న సీఐ శంకరయ్య తనకు నోటీసు ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారని, నిజానికి తనకు ఎలాంటి నోటీసూ ఇవ్వలేదని, కేసును తప్పుదారి పట్టించేందుకే పోలీసులే ఆ తప్పుడు స్టేట్‌మెంట్‌లన్నీ సృష్టించారని సీబీఐ వాంగ్మూలంలో పేర్కొన్నారు. వైఎస్ వివేకాకు, భాస్కర్‌రెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో విభేదాలున్నాయని రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
'2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్‌రెడ్డి కుటుంభమే కారణమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చడానికి తాము హైదరాబాద్‌లోని రెండు ఇళ్లు, ఒక ఫ్లాటు, హిమాచల్ ప్రదేశ్‌లోని జల విద్యుత్ కేంద్రంలో 10 శాతం వాటా అమ్ముకోవాల్సి వచ్చిందని వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి వివరించారు. కుటుంబసభ్యుల కోసం ఎన్ని త్యాగాలు చేసినా జగన్ తనంటే అసూయతోనే ఉంటున్నారని చనిపోవడానికి 2, 3 నెలల ముందు వివేకా చెప్పి బాధపడ్డారని తెలిపారు.
వైఎస్‌ఆర్ మరణించాక.. ఆ స్థానం నుంచి పోటీకి భాస్కర్‌రెడ్డి పేరును జగన్ ప్రతిపాదించారని అది వివేకాకు నచ్చలేదని, దీంతో వారి మధ్య సంబంధాలు మరింత దిగజారాయని పేర్కొన్నారు. అలాగే భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలకు విరుద్ధంగా వివేకా ఒక భూ వివాదం సెటిల్‌మెంట్‌లో పాల్గొనడంతో, అప్పటి నుంచి మరింత కక్ష పెంచుకున్నారని తెలిపారు.
వివేకా హత్య జరిగిన రోజు కడప మాజీ మేయర్ సురేష్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఓ కంప్లెయింట్ రాసుకువచ్చి తన భార్య సునీతను సంతకం పెట్టాలన్నారని.. దానిలో టీడీపీ నేతలు సతీష్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి పేర్లను అనుమానితులుగా పేర్కొనడంతో సంతకం చేయడానికి సునీత నిరాకరించారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్‌ను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
తన తండ్రి హత్య వెనుక కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి హస్తం ఉందని, అతన్ని విచారించి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు, ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు వైఎస్ వివేకా కూతురు సునీత లేఖలు రాశారు. వివేకా హత్య ఘటనలో అవినాష్ ప్రమేయం ఉందనే అంశాల్ని లేఖలో వివరించారు. వివేకా హత్యకేసు వ్యవహారం వెనుక ఉన్న కుట్రదారుల్ని బయటపెట్టాలని లేఖలో డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com