NGT: ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విస్మయం

NGT: ఏపీలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విస్మయం
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు... తమ ఆదేశాలు పట్టించుకోవట్లేదని ఎన్జీటీ ఆగ్రహం...

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే ఫిర్యాదులపై స్పందించిన NGT... ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నదుల్లో తక్షణం తవ్వకాలు ఆపేయాలని, కొత్తగా ఈసీలు తీసుకున్నాకే తవ్వకాలు చేపట్టాలని గత ఏడాది మార్చి 23న ఆదేశాలు ఇచ్చింది.అరణియార్‌ నదిలోని 18 రీచ్‌ల్లో జేపీ పవర్‌ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని 18 కోట్లు జరిమానా విధించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జరిమానాపై స్టే లభించింది. కానీ ఎన్జీటీ ఆదేశించినట్లు కొత్తగా ఈసీలు తీసుకొన్నాక ఇసుక తవ్వాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ. ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ పిటిషనర్‌ నాగేంద్రకుమార్‌ మళ్లీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర పర్యావరణ, అటవీశాఖతో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఇవ్వాలని, కలెక్టర్లు కూడా రీచ్‌లను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని NGT గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిస్థితిని కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక రూపంలో NGTకి వివరించింది. ఇసుక తవ్వకాల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ-సియా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా అనుమతులు జారీచేయలేదనిపేర్కొంది.

అయినప్పటికీ భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారని నివేదికలో పేర్కొంది. ఒక్కో రీచ్‌ నుంచి రోజుకు వెయ్యి నుంచి 2 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారని, చేతిరాతతో వే బిల్లులు ఇస్తున్నారని పేర్కొంది. కంప్యూటరైజ్డ్‌ బిల్లులు, సీసీ కెమెరాలు లేవని, వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ కూడా లేదని..ఇలా అడుగడుగునా ఉల్లంఘనలేనని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా రీచ్‌ వివరాలు అడిగితే జగన్ ప్రభుత్వం, గనులశాఖ ఇవ్వలేదని తెలిపింది. దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలోనూ ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా ఇచ్చిన నివేదికను చూసి NGT నిర్ఘాంతపోయింది. తాము పరిశీలించిన రీచ్‌ల్లో గతంలోగానీ, ఇప్పుడు గానీ ఇసుక తవ్వకాలే కనిపించలేదంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై విస్మయం వ్యక్తం చేసింది.

గతంలో గానీ, ఇటీవల గానీ ఆ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరగడంలేదని పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.... జనవరి 17 నుంచి 19 వరకు ఇసుక రీచ్‌లు తనిఖీలు చేయగా.ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయని, 2021 నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ శాఖ కమిటీ మంగళవారం ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. బుధవారం నాటి విచారణలో ఆ నివేదికలోని అంశాలను ఎన్జీటీ ప్రస్తావించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో..... 8 రీచ్‌లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 రీచ్‌లను తనిఖీ చేయగా వేటికీ ఈసీలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు లేవని తెలిపింది. అయినా వాటిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వివరించింది.

ఏపీ వ్యాప్తంగా సెమీ మెకనైజ్డ్‌ విధానంలో ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ జేపీ సంస్థకు, గనులశాఖ సంచాలకులకు 2023 ఏప్రిల్‌ 24న ఆదేశాలిచ్చామని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కొత్త ఈసీలు జారీ చేయలేదని సియా...ఎన్జీటీకి స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇసుక గుత్తేదారు ఎటువంటి ఈసీలు లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహించారని, నిబంధనలు ఉల్లంఘించారని ఎన్జీటీ స్పష్టంచేసింది. దీంతో గుత్తేదారు సంస్థ శిక్షార్హులు అని భారీ జరిమానా వేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే గుత్తేదారుకు జరిమానా విధించడంపై గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున... ఈ అంశాన్ని..... సుప్రీంకోర్టుకు నివేదించాలని అభిప్రాయపడింది.

Tags

Read MoreRead Less
Next Story