RAMMOHAN: శభాష్ రామ్మోహన్

ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం విజయవంతంగా పరిష్కారమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో కొన్ని నిబంధనలకు మినహాయింపులు ఇవ్వడం, సమయపాలన మెరుగుపరచడం ద్వారా ఇండిగో విమానాలు తిరిగి యథావిథిగా నడుస్తున్నాయి. సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా ఇండిగో తమ సర్వీసుల్లో పది శాతం కట్ చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కట్ అయిన సర్వీసులను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు. సంక్షోభం ముగిసిన నేపథ్యంలో, మంత్రి రామ్మోహన్ నాయుడు జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పూర్తి వివరాలను వివరిస్తున్నారు. వరుసగా అన్ని ప్రముఖ ఇంగ్లిష్, హిందీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు చేయబోయే సంస్కరణలను ధృడంగా విశ్లేషిస్తున్నారు.
సంక్షోభం పీక్‌లో ఉన్నప్పుడు రిపబ్లిక్ టీవీకి చెందిన ఆర్నాబ్ గోస్వామి మంత్రి వైఫల్యాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేసినా, రామ్మోహన్ నాయుడు తన పనిపైనే దృష్టి సారించారు. ఇప్పుడు, సమస్య పరిష్కారమైన తర్వాత, ఆయన దృఢమైన సమాధానాలు, సమస్యలను ఎదుర్కొన్న విధానంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.ప్రభుత్వ విధానాలను, బీజేపీని తీవ్రంగా విమర్శించే సీనియర్ జర్నలిస్టులు కూడా మంత్రి పనితీరు, ఆయన అప్రోచ్‌ను కొనియాడారు. సమస్యను యువనేతగా పరిష్కరించిన వైనం, మీడియా ద్వారా ప్రజలకు అందించిన స్పష్టమైన విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంది.
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్
పొందూరు ఖాదీకి ప్రతిష్ఠాత్మకమైన భౌగోళిక గుర్తింపు లభించిందని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టులో చేశారు. ‘‘శ్రీకాకుళం వాసిగా ఎంతో గర్వించదగ్గ క్షణం ఇది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, లెక్కలేనన్ని సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌ల తర్వాత పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జీఐ ట్యాగ్ లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక వస్త్రానికి వచ్చిన గుర్తింపు మాత్రమే కాదు.. శ్రీకాకుళం నేత కార్మికుల వారసత్వానికి లభించిన గౌరవం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి ప్రియమైన పొందూరు ఖాదీ.. ప్రతి నూలు పోగులో తరాల చరిత్రను మోస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మన నేత కార్మికులు తమ కళను వదల్లేదు. వారి ఓర్పు, నైపుణ్యం, నమ్మకం ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాయి. వారి చేతులు కేవలం వస్త్రాన్ని మాత్రమే కాదు ఒక గుర్తింపును తెచ్చాయి. ఈ జీఐ ట్యాగ్ సాధనలో అండగా నిలిచిన ఖాదీ & గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. తరతరాలుగా ఈ కళను కాపాడిన నేత కార్మికులకు ఈ గౌరవం అంకితం. జీఐ ట్యాగ్.. ’’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

