Nellore: వైసీపీలో సంక్షోభం..ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాప్‌..!

Nellore: వైసీపీలో సంక్షోభం..ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాప్‌..!
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పక్కన పెట్టిన జగన్; నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని టార్గెట్

నెల్లూరు జిల్లా వైసీపీలో సంక్షోభ సంకేతాలు కన్పిస్తున్నాయి. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాప్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఎమ్మెల్యేలపై నమ్మకం కోల్పోయిన వైసీపీ వారి కదలికలపై నిఘా పెట్టిందనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలే స్వయంగా చెప్పడం ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పక్కన పెట్టిన జగన్ తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్‌ ట్యాప్‌ అయ్యిందనే విషయం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన కదలికలపై అనుమానంతో వైసీపీ అధిష్ఠానమే ఫోన్‌ ట్యాప్‌ చేయించిందని శ్రీధర్‌రెడ్డి గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన భవిష్యత్‌ రాజకీయ ప్రయాణంపై కోటంరెడ్డి అంతర్మథనంలో పడ్డారు. నియోజకవర్గ సమస్యలపై డీఆర్‌సీ, జడ్పీ సమావేశాల్లో శ్రీధర్‌రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలపై మాట్లాడటమే వైసీపీ నేతల పాలిట శాపంగా మారుతోంది. ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే పార్టీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడా అనే అనుమానం అధిష్ఠానానికి కలిగినట్లుంది. ఆ క్రమంలోనే శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.

వైసీపీ పెద్దల ఆదేశాలతోనే ఇంటెలిజెన్స్‌ శాఖ తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందని ఎమ్మెల్యే భావిస్తున్నారని ఆయన సన్నిహితుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డ తన సేవలకు గుర్తింపు లేకపోయిందని ఎమ్మెల్యే ఢీలా పడినట్లు తెలుస్తోంది. పైగా తనను అనుమానించడాన్ని కోటంరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. జగన్‌ తొలి క్యాబినెట్‌లోనే కోటంరెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే అది కుదరలేదు. ఇక రెండో విస్తరణలోనూ నిరాశే ఎదురైంది. పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తే పదవి దక్కకపోగా అవమానాలు ఎదురవుతున్నాయని సన్నిహితుల వద్ద కోటంరెడ్డి వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ వివాదంతో వైసీపీలో ప్రకంపనలు మొదలైనట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story