Nellore: గల్లంతైనవారికోసం గాలింపు ముమ్మరం

Nellore: గల్లంతైనవారికోసం గాలింపు ముమ్మరం
చెరువు వద్ద నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు, గుమిగూడిన గ్రామస్థులు

నెల్లూరు జిల్లాలో గల్లంతయిన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు చెరువు వద్ద నిరీక్షిస్తున్నారు. తమ బిడ్డలు క్షేమంగా తిరిగొస్తారని ఎదురు చూస్తున్నారు . అయితే ఉదయం చేపట్టిన గాలింపు చర్యల్లో కల్యాణ్ మృత దేహం లభించడంతో కల్యాణ్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.గాలింపు చర్యల నేపథ్యంలో గ్రామస్థులంతా చెరువు వద్ద గుమికూడారు.

చెరువులో గల్లంతయిన వారంతా స్నేహితులు.. ఒకే వీధిలో ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తుంటారు. వయసులో చిన్నా పెద్దా తేడా ఉన్నా.. అందరూ కలిసి మెలిసి తిరుగుతూ స్నేహానికి చిరునామాగా మారారు. ఆదివారం కావడంతో సరదాగా కలుద్దామనుకున్న యువకులు అనుకున్న టైంకి కలిశారు. ఈ నేపథ్యంలో వీరిలో కొందరు గతంలో చెరువు వద్ద సరదాగా గడిపిన సందర్భాన్ని మిగిలిన వారితో పంచుకున్నారు. దీంతో చెరువు వద్ద గడిపేందుకు అంతా కలిసి వెళ్లారు. ఒడ్డున ఉన్న చేపలకు మేత వేసేందుకు వినియోగించే చిన్న పడవలో చెరువులోకి వెళ్లారు. అలా వెళ్లిన వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. మొత్తం పది మందిలో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా- మిగిలిన వారి ఆచూకీ కోసం అర్ధరాత్రి ఒంటి గంట వరకు గాలింపు కొనసాగుతూనే ఉంది.

చెరువు వద్ద ఓ వైపు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. అర్ధరాత్రి కృష్ణపట్నం నుంచి మోటార్ బోటును రప్పించి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం మళ్లీ పోలీసులు, గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story