అనాథలైన ఆడపిల్లల పట్ల ఏపీ అధికారులు, గ్రామపెద్దల అమానవీయత

అనాథలైన ఆడపిల్లల పట్ల ఏపీ అధికారులు, గ్రామపెద్దల అమానవీయత
అనాథలైన ఆడపిల్లలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు... వారి సొమ్మును దోచుకున్నారు.

వాళ్ళు అందరూ ఆడపిల్లలు. తల్లిదండ్రుల మరణంతో అనాథలయ్యారు. ఉండడానికి సరైన గూడు కూడా లేని దయనీయ పరిస్థితి. గిరిజనులు... చదువు సంధ్య లేని అమాయకులు. మానవత్వం చూపాల్సిన అధికారులు, పెద్ద మనుషులు రాబంధుల్లా వ్యవహరించారు. తండ్రి మరణంతో ప్రభుత్వం అందజేసిన బీమా సొమ్మును వాటాలు పంచుకున్నారు. ఆడపిల్లల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం... మానవత్వానికి మాయని మచ్చగా నిలుస్తోంది.

అనాథలైన ఆడపిల్లలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు... వారి సొమ్మును దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు ముక్కుతిప్ప గ్రామంలో ఓ పేద గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. మల్లికా రమణయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. అందరూ ఆడబిడ్డలే. రమణయ్య చేపల వేటతో ఆ కుటుంబం జీవనం సాగించేది. లక్ష్మమ్మ 13 ఏళ్ల క్రితం మరణించింది. రమణయ్య కాయకష్టం చేస్తూ... బిడ్డలను పోషించుకుంటూ వచ్చాడు. ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేశాడు. ఐదో సంతానమైన స్వాతికి మాటలు రావు. మానసిక ఎదుగుదల కూడా లేకపోవడంతో ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. రమణయ్య ఈ ఏడాది మార్చి 21న హఠాత్తుగా మృతి చెందాడు. తల్లి, తండ్రి కాలం చేయడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ముగ్గురు ఆడ పిల్లలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరు పెదనాన్న హనుమంతు సంరక్షణలో ఉన్నారు. హనుమంతు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కూలీ పనులు చేసుకుంటూ తమ్ముడి కూతుళ్ల బాగోగులు చూస్తున్నాడు.

రమణయ్య మృతితో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకం కింద 2 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆడ పిల్లల బతుకుదెరువుకు అందించాల్సిన వెలుగు ఉద్యోగులు, గ్రామ పెద్దలు కొందరు వాటాలు పంచుకుని, చివరకు కేవలం 45 వేలు మాత్రమే వారికి అందించారు. రమణయ్య అప్పు పడ్డాడని పత్రాలు చూపించి.. కోతలు పెట్టారు. ప్రభుత్వం అందజేసే సాయాన్ని ప్రతి రూపాయి ఆ కుటుంబ ప్రయోజనాలకే ఉపయోగపడాలని, బ్యాంకర్లు, ప్రైవేట్‌ అప్పుల వాళ్లు తీసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలు పట్టించుకోకుండా అధికారులు, గ్రామపెద్దలు దోపిడీకి పాల్పడ్డారు. వెలుగు అధికారి కూడా పదివేల రూపాయలు తీసుకున్నాడు.

గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్థానికులు వెలుగు ఉద్యోగులను సంప్రదిస్తే... సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకటికి పది సార్లు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. ఈ విషయం బయటకు రావడంతో పొక్కడంతో హడావుడిగా వీఓఏ తీసుకున్న 10 వేలు ఆడపిల్లలకు తెచ్చి ఇచ్చేశాడు. నెలనెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలాంటి సాయంలో కక్కుర్తికి పాల్పడుతున్న ఉద్యోగుల తీరుపై స్థానికులు అసహ్యించుకుంటున్నారు. ఈ వ్యవహారం జిల్లాలో సంచలంగా మారడంతో అధికారులు... గిరిజన కుటుంబం వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ బీమా చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఆత్మకూరు ఏరియా కోఆర్డినేటర్ పి.వెంకటేశ్వర్లు, కలువాయి ఏపీఎం సతీశ్‌, సీసీ వెంకట రమణమ్మను జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story