Singer Parvathi : ఒక్క పాటతో ఏపీ మంత్రినే చలించేలా చేసిన పార్వతి.. వెంటనే ఊరికి బస్సు శాంక్షన్
సంగీతానికి రాళ్లనైనా కరిగించే శక్తి ఉంటుంది అంటారు. అలాంటిది మనుషులను, వారి మనసులను మార్చే శక్తి ఉండదా చెప్పండి! పార్వతి చేసింది అదే. తన గీతంతోనే సంగీతం శక్తి ఏమిటో చూపించింది. పాటతో అందరి మనసులు గెలుచుకుంది. అలాంటి ఆమె ప్రతిభకు దృఢమైన మనోసంకల్పం తోడైంది. ఆమె చక్కటి పాటకు మంచి మాట జత కలిసింది. అది.. ఆ అమ్మాయి ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేసింది. ఈ ఘనత మాత్రం ముమ్మాటికీ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతిదే. ఆమె పాటకు ఫిదా అయిన ఏపీ మంత్రి పేర్ని నాని.. ఆ అమ్మాయి కోరుకున్న వెంటనే కాదనకుండా లక్కసాగరానికి బస్సును శాంక్షన్ చేయించారు.
పార్వతిది వ్యవసాయ కుటుంబం. కానీ ఆమెకు సంగీతం అంటే ప్రాణం. తన ఊరిలో మ్యూజిక్ ను నేర్పించేవారు లేరు. అందుకే పక్కూరుకు వెళ్లి నేర్చుకోవాలని అనుకుంది. కానీ అక్కడికి వెళ్లాలంటే నడిచే వెళ్లాలి. ఎందుకంటే ఆ ఊరికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. అసలు బస్సే రాదు. అయినా సరే.. సంగీతంపై ఉన్న మక్కువను చంపుకోలేక.. పక్కూరికి నడుచుకుంటూనే వెళ్లి సంగీతం నేర్చుకుంది. తరువాత ఓ తెలుగు ఛానల్ లో నిర్వహిస్తున్న పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది.
పాటల పోటీల్లో పార్వతి గానానికి అందరూ ఫిదా అయ్యారు. జడ్జీలైతే ఇంకా సంతోషపడ్డారు. ఈ కాంపిటీషన్ కు జడ్జ్ గా వ్యవహరించిన సింగర్ స్మిత.. ఏం కావోలో కోరుకోమని పార్వతిని అడిగారు. ఆమె కోరిక విన్న స్మిత వెంటనే ఏపీ మంత్రి పేర్ని నానితో మాట్లాడారు. దీంతో ఆయన.. తాను కూడా ఆ అమ్మాయి పాటను వింటానని చెప్పారు. ఆమె గానానికి ఫిదా అయ్యారు. ఏం కావాలో కోరుకోమ్మా అని మంత్రే స్వయంగా అడగడంతో తొలుత పార్వతి తటపటాయించింది. చివరకు తన మనసులో మాట బయటపెట్టింది.
ఊరికి బస్సు సర్వీసు లేదని.. ఇది ఎన్నో ఏళ్ల నాటి కల అని.. తమ ఊరికి బస్సును వేయించాలని కోరుకుంది. పార్వతి పాటే బాగుంది అనుకుంటే.. ఆమె మాట ఇంకా నిజాయితీగా, స్వచ్ఛంగా అనిపించింది. ఆమె మంచి మనసు మంత్రి పేర్ని నానికి అర్థమైంది. అందుకే వెంటనే ఆ ఊరికి బస్సును వేయిస్తామని.. ఇకపై రోజూ బస్సు సర్వీసును నడిపిస్తామని చెప్పారు. వెంటనే బస్సును కూడా శాంక్షన్ చేశారు. పాటతోనే అందరి మనసులూ గెలుచుకుంది అనుకుంటే.. తన మంచి మాటతో అందర్నీ కట్టిపడేసింది. అందుకే ఆమె పాటకు, మాటకు జడ్జీలతోపాటు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా చలించారు. డోన్ డిపో నుంచి లక్కసాగరం గ్రామానికి ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు బస్సు సర్వీసు ప్రారంభమైంది.
తమ ఊరికి కూడా ఆర్టీసీ బస్సు ఎప్పటికైనా రాకపోదా.. అందులో తాము దర్జాగా కూర్చుని ప్రయాణించకపోమా అని లక్కసాగరం వాసులు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ కల.. ఇన్నాళ్లూ కేవలం కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు పార్వతి పుణ్యమా అని ఆమె ప్రతిభకు మెచ్చి ఏపీ మంత్రి పేర్ని నాని బస్సును శాంక్షన్ చేయించడంతో ఊరంతా ఉబ్బితబ్బిబ్బవుతోంది. తమ మేలు కోసం.. ఊరి మంచి కోసం ఆలోచించిన పార్వతికి ఊరు ఊరంతా సలామ్ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆ ఊరికి ఉన్న బస్సు కష్టాలు పార్వతి వల్లే తీరాయి. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు నిజ జీవితంలోనూ చోటుచేసుకున్నాయి. అయినా.. నీలాంటి మంచి మనసున్న వాళ్లు, నిస్వార్థంగా ఆలోచించేవాళ్లు ఈరోజుల్లో కూడా ఉన్నారంటే.. పార్వతి.. నీకు హ్యాట్సాఫ్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com