Macherla : వైద్యుల నిర్లక్ష్యం.. బొడ్డు పేగును కట్ చేయబోయి..

Macherla : వైద్యుల నిర్లక్ష్యం.. బొడ్డు పేగును కట్ చేయబోయి..
Macherla : ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు

Macherla : ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని జగన్ ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం మాత్రం వీడడం లేదు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. స్వరూప అనే మహిళ గత నెల 30న తొలి కాన్పు కోసం వచ్చింది. డెలివరీ చేసి శిశువును బయటకు తీసిన హాస్పిటల్ సిబ్బంది.. ఆమె స్పృహలోకి రాక ముందే బొడ్డు తాడు కోసే క్రమంలో పసికందు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. పొరపాటు చేశామని గ్రహించిన హాస్పిటల్ సిబ్బంది.. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు పంపించారు. అయితే, అక్కడ పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బయటకు రాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారు.

బొడ్డు తాడు కోసే ప్రయత్నంలో శిశువు చిటికెన వేలు తెగిన మాట వాస్తవమేనని వైద్యాధికారులు అంగీకరించారు. శిశువు తల్లిదండ్రులు, బంధువులు నిలదీయడంతో వేలు చివర్లో తెగిందని, శస్త్రచికిత్స చేసి అతికిస్తామని సమాధానం ఇస్తున్నారు. అటు.. ఈ ఘటనకు కారకురాలు అంటూ హాస్పిటల్ స్వీపర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని పల్నాడు జిల్లా వైద్య విధాన పరిషత్‌ అధికారి తెలిపారు.

అయితే వైద్య సిబ్బంది పర్యవేక్షణలో జరగాల్సిన కాన్పులో పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు కోయడమేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా స్వీపర్‌పై చర్యలేంటని మండిపడుతున్నారు. శిశువు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story