Ananthababu : డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో తెరపైకి కొత్త ప్రశ్నలు

Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పని చేసి మానేసిన సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కాకినాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిన్న రాత్రి పదిన్నర ప్రాంతంలో డ్రైవర్ సుబ్రమణ్యం ఇంటికి వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు.. తన బర్త్‌డే పార్టీ ఉంది.. రావాలంటూ తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే.. తెల్లవారు జామున విగతజీవిగా ఉన్న సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకొచ్చారు. యాక్సిడెంట్‌లో సుబ్రమణ్యం మృతి చెందాడని.. మృతదేహాన్ని కారులోంచి దించాల్సిందిగా సుబ్రమణ్యం బంధువులకు హుకుం జారీ చేశారు. వారు తిరగబడడంతో.. ఎమ్మెల్సీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఐతే.. ఏ యాక్సిడెంటూ జరగలేదని.. సుబ్రమణ్యాన్ని హత్య చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మతదేహాన్ని తరలించేందుకు వచ్చిన పోలీసుల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడికి వచ్చిన విపక్ష నేతల్ని పోలీసులు నిలువరించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే సుబ్రమణ్యం మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
ఐతే... ఈ మొత్తం ఎపిసోడ్‌లో అనేక అనుమానాలు.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్రైవర్ సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ ఆనంత బాబు ఎందుకు తీసుకెళ్లారు? బర్త్‌డే పార్టీ అంటూ సుబ్రమణ్యంను ఎక్కడికి తీసుకెళ్లారు? రాత్రి పదిన్నరకు ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లడంలో ఆంతర్యమేంటి? బర్త్‌డే పార్టీకే వెళ్తే టిఫిక్ కోసం సుబ్రమణ్యం బయటికెందుకు వెళ్లాడు? ఎమ్మెల్సీ చెబుతున్నట్లు యాక్సిడెంట్ అసలు ఎక్కడ జరిగింది? యాక్సిడెంట్ జరిగితే పోలీసులకు ఎందుకు చెప్పలేదు? స్పాట్ నుంచి డెడ్‌బాడీని ఎందుకు తరలించారు? ఎమ్మెల్సీనే స్వయంగా కారులో డెడ్‌బాడీ వేసుకుని ఎందుకు వచ్చారు?
డ్రైవర్‌గా మానేసిన సుబ్రమణ్యాన్ని గతంలో బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి నిన్న.. డ్రైవర్‌ను డబ్బుల విషయంలో బెదిరించారా.. మరేదైనా కారణంతో బెదిరించారా? తేలాల్సి ఉంది. ఐతే.. ఏ తప్పూ చేయకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి ఎందుకెళ్లారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తప్పు చేయకపోతే పరారవ్వాల్సిన అవసరం ఎమ్మెల్సీకేంటి? ఎమ్మెల్సీ ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ చేశారు?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com