వ్యవస్థలో మార్పు రావాలి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్

వ్యవస్థలో మార్పు రావాలి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్
నేటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఉద్యోగ నిర్వహణలో చోటు చేసుకున్న పలు విషయాలను పంచుకున్నారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం తనకు సంతృప్తి కలిగించిందని ఆయన అన్నారు.

స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా సిబ్బంది, అధికారులు అందరూ సహకరించారని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అందరూ సమన్వంతో పనిచేశారని ప్రశంసించారు.

తెలంగాణలో తనకున్న ఓటు హక్కుని రద్దు చేసుకుని ఏపీలోని తన సొంత గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్నానని అన్నారు. అది స్థానికంగా ఉండే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా అధికారి పరిధిలో ఉండే అంశమని అన్నారు.

ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదని, తన అప్పీలు జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు.. ఇప్పుడు ఒక పౌరుడిగా తన ఓటు హక్కును సాధించుకుంటానని అన్నారు.

అవసరమైతే హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తానన్నారు. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక చోట ఓటు వేసే హక్కు ఉంటుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదన్నారు.

వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. బాధ్యతల నిర్వహణలో హైకోర్టు పూర్తి సహకారం అందించిందన్నారు. ప్రజలు, మీడియా నుంచి అపూర్వ సహకారం అందిందని నిమ్మగడ్డ వివరించారు.

2016 ఏప్రిల్ 1న ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయింది. ఆయన స్థానంలో కొత్తగా నియమితులైన నీలం సాహ్ని గురువారం బాద్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story