TIRUMALA: అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

TIRUMALA: అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
చిన్న శేష వాహనంపై విహరించిన స్వామివారు... రాత్రికి హంస వాహనంపై నుంచి అభయ ప్రధానం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిన్నశేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. రాత్రికి హంస వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. సోమవారం సాయంత్రం వేళ వేదమంత్రాలు, మంగళ వాద్యాలు నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటల నుంచి మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు.


సోమవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ఉభయదేవేరుల సమేత శ్రీ మలయప్ప స్వామి వారి సమక్షంలో బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత. రంగనాయకుల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు సీఎంకు వేదాశీర్వచనం చేశారు.


తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజున మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై విహరించారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు సాంస్కృతిక నాట్యాల నడుమ నాలుగు మాఢ వీధుల్లో విహరించి.... భక్తులను కటాక్షించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగులు వేస్తున్నారు. బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. స్వయంగా ప్రొటోకాల్‌ ప్రముఖులనే అనుమతించనున్నారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలనూ రద్దు చేశారు.

నిబంధనలను అతిక్రమించిన కొడాలి నాని

నిబంధనలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలోకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రవేశించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి కొడాలి నాని నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించడం విమర్శలకు దారితీసింది. సీఎం జగన్‌ కంటే ముందుగానే మహా ద్వారం గుండా ఆయన ఆలయంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


Tags

Read MoreRead Less
Next Story