ఏపీలో అన్నదాతలకు గుండెకోత మిగిల్చిన నివర్‌ తుపాను

ఏపీలో అన్నదాతలకు గుండెకోత మిగిల్చిన నివర్‌ తుపాను

ఏపీలో అన్నదాతలకు నివర్‌ తుపాను గుండెకోత మిగిల్చింది. దాదాపు 10 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యవసాయ, ఉద్యానశాఖల పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాల్లోని పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం వేయి కోట్లకు పైగా పంటనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పైరు నీట మునగడంతోపాటు.. నేల కరవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. భారీవర్షాలు కొనసాగుతుండటం, వరదలు ముంచెత్తడంతో నష్ట తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.

ఖరీఫ్‌ ఆరంభం నుంచి కురుస్తున్న భారీవర్షాలు, ముంచెత్తుతున్న వరదలతో 20 లక్షల ఎకరాల వరకు పంటలు దెబ్బతిని రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. ప్రస్తుత భారీ వర్షం మరోసారి వారి ఆశల్ని తుంచేసింది. గుంటూరు జిల్లాలో వ్యవసాయ పంటనష్టం అధికంగా ఉంది. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలోనూ 70 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రకాశంలో అధికంగా మూడున్నర లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం తలెత్తింది.

ప్రస్తుతం ఖరీఫ్‌, రబీలకు సంబంధించి 8 జిల్లాల్లో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. ఇందులో 38 లక్షల ఎకరాల వరకు ఖరీఫ్‌ పంటలే సాగవుతున్నాయి. ఇందులో 13 లక్షల వరకు వరి ఉండగా.. అధికశాతం కోత దశకు చేరింది. ప్రాథమిక అంచనా ప్రకారం 5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.

గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో వరి కోత దశలో ఉంది. ఈ దశలో ఎడతెరపి లేకుండా రెండు రోజులుగా వానలు కురుస్తుండటంతో పైరు నేల వాలింది. కోత కోసిన ఓదెలు నీటిలో తేలుతున్నాయి. పొలాల్లోకి నీరు చేరడంతో కోతలూ నిలిచిపోయాయి. ఇప్పటికే కోసిన వరి ఓదెలపై నీరు చేరింది. రాయలసీమతోపాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సెనగ సాగు మొదలైంది. ఇప్పటికే 5 లక్షల ఎకరాల్లో విత్తనం వేశారు. కొన్నిచోట్ల పొలాలు సిద్ధం చేసి ఉంచారు. పొలాల్లో నీరు నిలవడంతో.. మొలకెత్తిన సెనగకు నష్టం తప్పదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లాలో రబీ వేరుసెనగ, ఉలవ పైర్లు నీటిలో ఉన్నాయి. ప్రకాశంలో రబీ మినుము అక్కడక్కడా నీట మునిగింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగనారు నాటుతున్నారు. వర్షాలకు నీరు నిలవడంతో మొక్కలు ఉరకెత్తి చనిపోతాయేమో అనే భయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story