తుఫాను ప్రభావం తగ్గినా.. నెల్లూరు జిల్లా వాసులను వెంటాడుతోన్న మరో భయం

తుఫాను ప్రభావం తగ్గినా.. నెల్లూరు జిల్లా వాసులను వెంటాడుతోన్న మరో భయం

నివర్ తుఫాను ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోగా.. నెల్లూరు జిల్లా వాసులను మరో భయం వెంటాడుతోంది. జిల్లాలోని పెన్నా పరివాహక ప్రాంతాల్లో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. సోమశిల జలాశయం నుంచి ఎన్నడూ లేనివిధంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా నది మరింత తీవ్ర రూపం దాల్చుతోంది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమశిళ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దీంతో 12 గేట్లలో 9 గేట్లను 9 మీటర్ల మేర పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 2001 తర్వాత.. సోమశిళ జలాశయం నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం ఇదే ప్రథమం. వరదనీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరి.. జనం అవస్థలు పడుతున్నారు.

మరోవైపు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిజ్‌జామ్ అయ్యింది. కైవల్యానది ఉగ్రరూపంతో హైవే కోతకు గురైంది. 2015లో భారీ వర్షాల వల్ల రోడ్డు కొట్టుకుపోయిన చోటే మళ్లీ గండి పడింది. ప్రస్తుతం వరద ఉధృతి నేపథ్యంలో పునరుద్ధణకు ఆలస్యం అవుతోంది. అటు ప్రధాన రహదారి తెగిపోవడంతో నెల్లూరు చెన్నై వైపు దాదాపు 180 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రోడ్డు మరమ్మతులు చేస్తే తప్ప వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేదు. భారీవర్షంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినవారి పరిస్థితి దయనీయంగా ఉంది. తాగునీరు, ఆహారం కోసం డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల స్వచ్ఛందంగా కొందరు వారికి ఆహారం అందించారు. అటు, నేషనల్ హైవే అధారిటీ నిర్లక్ష్యం వల్లే మరోసారి నెల్లూరులో రోడ్డు కొట్టుకుపోయిందని విమర్శలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story