నివర్‌ తుపాను ప్రభావం.. మరో రెండ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

నివర్‌ తుపాను ప్రభావం.. మరో రెండ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

తమిళనాడు, పుదచ్చేరితోపాటు ఏపీలోని పలు ప్రాంతాలపై నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. బుధవారం రాత్రి రెండున్నర గంటల సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటగా.. గాలుల ప్రభావం గురువారం మధ్యాహ్నం వరకు కనిపించింది. పాండిచ్చేరికి వాయువ్యంగా పయనించి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నాయి.. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

కుంభవృష్టితో తమిళనాడు, పుదుచ్చేరి అతలాకుతలమైంది. ఒకవైపు ఎడతెరిపిలేని వర్షాలు, మరోవైపు చలిగాలులతో జనం వణికిపోతున్నారు. చెన్నైలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భీకర తుపాను గాలుల దాటికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కొన్నిచోట్ల రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. తమిళనాడులోని పలు జిల్లాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. చెన్నై విమానాశ్రయంలో 26 విమాన సర్వీసులు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.. పునరావాస కేంద్రాల్లో బాధితులను ముఖ్యమంత్రి పళనిస్వామి పరామర్శించారు.

నివర్‌ ఎఫెక్ట్‌తో చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 5ఎస్డీఆర్‌ఎప్‌, 4ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఘోరంగా ఉంది. నివర్‌ ఎఫెక్ట్‌తో పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. వదమాలపేట, ఏర్పేడు, సత్యవేడు, రేణిగుంట మండలాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా తిరుమలలోని బాలాజీ నగర్‌లో ఉన్న కమ్మూనిటీ హాల్‌ ప్రహారీ గోడ కుప్పకూలింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలోని రెండో ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గోగర్భం డ్యాం నిండటంతో... అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

భారీ వర్షాలకు తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్ని నీట మునిగాయి. వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం తినేందుకు ఆహారం కూడా లేకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

చిత్తూరు జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలం జింకలమిట్ట దగ్గర మల్లెమడుగు వాగులో చిక్కుకున్న ముగ్గురిలో ఇద్దరిని రెస్క్యూటీం కాపాడింది. మరో రైతు ప్రసాద్‌ ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన ప్రసాద్‌ కోసం ఎన్టీఆర్‌ఎఫ్‌ టీం మల్లెమడుగు వాగులో ముమ్మరంగా గాలిస్తుంది. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లే రైతులు వాగులో చిక్కుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

చంద్రగిరి మండలంలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమం అయ్యాయి. వరద ఉధృతికి రహదారులు దెబ్బ తింటున్నాయి. కొటాల కూచివారిపల్లెలో రోడ్డు దెబ్బతింది. నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది.

రామచంద్రపురం మండలంలో రాయల్‌ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రైల్వేకోడూరులో వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.. గుంజనేరు, గొట్టిమాను కోన, పింఛా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గేట్లను ఎత్తిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుందూ, పెన్నా, చెయ్యేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాలపల్లి-కుక్కలదొడ్డి మార్గంలో వరద ప్రవాహానికి రోడ్డు కుంగిపోయింది.

నెల్లూరు జిల్లాలోనూ నివర్‌ తుపాను ఎఫెక్ట్‌ చూపిస్తోంది.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తుతోంది.. చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనంతసాగరం మండలం రేవూరులో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పడమటి నాయుడుపల్లి గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కృష్ణా జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో వరి పంట నీట మునిగింది.. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాజోలు దీవిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పంట నీట మునిగింది. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో వేలాది ఎకరాలు నీటమునిగాయి.

Tags

Next Story