నిరుద్యోగులను జగన్ సర్కార్ మోసం చేస్తోంది

నిరుద్యోగులను జగన్ సర్కార్ మోసం చేస్తోంది
భగ్గుమంటున్న నిరుద్యోగులు

జాప్యం జరగదు నవంబరు ఆఖరులోగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చేస్తున్నాం. నిరుద్యోగులూ సిద్ధంగా ఉండండి నవంబర్‌ 1న APPSC ఆర్భాట ప్రకటన ఇది. కానీ వాస్తవంలో అంతా మోసం. నోటిఫికేషన్ల ఉసేలేకపోవడంతో నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. ఇది వైకాపా ప్రభుత్వ అసమర్థతకు, నమ్మక ద్రోహానికి నిదర్శనమని మండిపడుతున్నారు.

ఇవిగో పోస్టులు, నోటిఫికేషన్లు అంటూ వైకాపా ప్రభుత్వం.... మరోసారి నిరుద్యోగులను ఊరించి మోసగిస్తోంది. 2021 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం..గ్రూపు2, కళాశాలల లెక్చరర్ల పోస్టులు, 5 ఇతర పోస్టుల భర్తీకి ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. సీఎం చెప్పినవీ అమలు కాకపోతుండటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 2021 జూన్ 18న, గత ఏడాది మార్చిలో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా...గ్రూపు-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ ఏపీపీఎస్సీ ఇప్పటికీ జారీ చేయలేదు. గ్రూపు-1, గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటిని పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. చివరికి గ్రూపు-1 కింద 110, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి 2022 మార్చి 31న ఆర్థికశాఖ మరో జీఓ జారీ చేసింది. గ్రూపు-1 నియామకాలు పూర్తయ్యాయి. మిగిలిన నోటిఫికేషన్లు రానేలేదు. తర్వాత మళ్లీ గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టుల్ని కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి నవంబరు ఆఖరులోగా నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 267, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 99తోపాటు ఇతర ప్రభుత్వ శాఖల పోస్టులూ ఉన్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 2న జారీ చేసిన జీఓ 77 ప్రకారం మహిళలు, స్పోర్ట్స్, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగుల కేటగిరీ పోస్టుల భర్తీ విధానంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు రోస్టర్ పాయింట్లను ఏపీపీఎస్సీ కార్యాలయానికి పంపాలి. కానీ జీఓ 77లో ఉన్న తికమక వల్ల ప్రభుత్వశాఖల అధికారులు రోస్టర్ పాయింట్ల వివరాల్ని పంపలేకపోయారు. ఉన్నతస్థాయిలో సమీక్ష సమావేశాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించినా కొందరికి ఇప్పటికీ ఆ మార్పులు అర్థమే కాలేదు. సాధారణ పరిపాలనశాఖ అధికారులు నమూనాల్ని పంపినా ప్రభుత్వ శాఖల నుంచి స్పందన లేదు. సచివాలయంలో పక్కపక్కనే సంబంధిత ప్రభుత్వ శాఖలున్నా పురోగతి శూన్యం. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇండెంట్లు రాక, అమలు విధానంపై స్పష్టత లేక నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. నోటిఫికేషన్ల జారీ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు అభ్యర్థులు వయోపరిమితిపరంగా అనర్హులవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా.. పరీక్షల నిర్వహణ సహా నియామకాల పూర్తికి సమయం సరిపోకపోవచ్చు. మొత్తం ప్రక్రియ పూర్తికావడం కొత్త ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story