Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు లేనట్టేనా

Gudivada Amarnath:  మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు సీటు లేనట్టేనా
అనకాపల్లిపై సీఎం జగన్ క్లారిటీ

మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కడం కష్టమేననే ప్రచారం సాగుతోంది. వాటికి బలాన్ని చేకూర్చేలా గురువారం అనకాపల్లిలో జరిగిన సభలో సీఎం జగన్ఆ నియోజకవర్గ సీటుపై పూర్తి స్పష్టత ఇచ్చారు. దీంతో మంత్రి అమర్నాథ్‌ ఆశలకు గండిపడినట్లుగా తెలుస్తోంది.

అనకాపల్లి వైకాపా సీటు భరత్‌కేనని సీఎం జగన్‌ ఖరారు చేసేశారు. జగన్‌ ప్రకటనతో మంత్రి అమర్నాథ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. గతంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా భరత్‌ను ప్రకటించాక అమర్నాథ్‌కు పెందుర్తి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ సీటు సిటింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కేనని అధిష్ఠానం చెప్పినట్లు ఆయన అనుచరవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ తర్వాత ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో అమర్‌కు సీటు ఇచ్చే అవకాశాలపై పరిశీలించినప్పటికీ సామాజిక సమీకరణాలు, సర్వేలలో వెనుకబాటుతో మంత్రి ఆశలకు గండిపడింది. తిరిగి అనకాపల్లి సీటే ఇస్తారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా, సీఎం ఆ సీటు భరత్‌కేనని తాజాగా తేల్చిచెప్పేశారు.

భరత్‌కే సీటు అంటూ సీఎం ప్రకటించే సమయంలో పక్కనే ఎంపీ సత్యవతి ఉన్నప్పటికీ ఆమె అభ్యర్థిత్వంపై ఆయన ప్రకటన చేయలేదు. దీంతో ఈసారి ఆమెకు మొండి చేయి చూపినట్లేననే చర్చ సాగుతోంది. అనకాపల్లి ఎంపీ సీటు అమర్‌కు ఇస్తారంటూ ఆయన అనుచరగణం చెప్పుకొస్తున్నాఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో ఒకటి గవర సామాజికవర్గానికి ఇవ్వడం ఆనవాయితీ కావడంతో ఆ రేసులో ఆడారి ఆనంద్ సోదరి పీలా రమాకుమారి, వైకాపా బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేటి కాశీవిశ్వనాథ్ ఉన్నారు. గాజువాక సిటింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డిని సమన్వయకర్తగా మార్పు చేసి, ఆ స్థానంలో ఉరుకూటి చందును నియమించారు. మంత్రి అమరనాథ్‌కు బంధువు, శిష్యుడైన చందుని తిప్పల నాగిరెడ్డి వర్గం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవల ఆ స్థానంలో విశాఖ మేయర్ గొలగాని హరివెంకటకుమారికి సీటు అంటూ సర్వేలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో గాజువాకకు నిధులు ఎక్కువగా కేటాయించారు. శంకుస్థాపనల్లో మేయర్ ఇటీవల హడావుడిగా ఉన్నారు. దీంతో గాజువాకలోనూ అమర్నాథ్ సూచించిన వారికి చుక్కెదురు అయినట్లేనని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story