Ap News : కుప్పానికి అరకొరగా నీటి జలాలు

కుప్పం నియోజకవర్గాన్ని ఉద్ధరించింది తానేనంటూ సీఎం జగన్ కొట్టుకున్న సొంత డప్పంతా ఉత్తదే అని ఒక్కరోజులోనే బట్టబయలైంది. ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన కృష్ణా జలాలు ఒక్కరోజులోనే మాయమైపోయాయి. సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్లారో లేదో తెల్లారేసరికి నీరు లేదు కదా ఏకంగా గేట్లనే అధికారులు పీకేశారు. ఇదేనా కుప్పాన్ని ఉద్ధరించటమంటే అంటూ రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.
వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కాలువకు అడ్డుకట్ట వేసి మరీ నిల్వ చేసిన జలాలను సీఎం జగన్ విడుదల చేసి ఫొటోలకు ఫోజులిచ్చారు. రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం సీఎం నీళ్లు విడుదల చేసిన చోట రెండోరోజు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.నీటి విడుదల కార్యక్రమం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సీఎం జగన్ చేసిన హడావుడి, చెప్పిన మాటలు కేవలం ఎన్నికల స్టంటేనంటూ రైతులు ఆరోపించారు. ముఖ్య మంత్రి గొప్పల కోసం ఏర్పాటుచేసిన గేట్లను అధికారులు పొక్లెయిన్‌తో తొలగించేశారు. సీఎం వచ్చి వెళ్లిన ఒక్కరోజుకే నీటి విడుదల ఆపేసిన ప్రభుత్వం 110 చెరువులను ఎలా నింపుతుందని నిలదీశారు. కుప్పంపై ప్రేమ ఒలకబోస్తూ, చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప నిజంగా జగన్‌కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. కుప్పాన్ని హంద్రీనీవా జలాలతో సస్యశ్యామలం చేయడం తథ్యమని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజుపేటవద్ద అట్టహాసంగా ‘గేటు’ ఎత్తిన తర్వాత... శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ విడుదల చేసిన నీళ్లు ఇక్కడి దాకా కూడా రాలేదు. ప్రారంభోత్సవ సమయంలో సుమారు ఐదున్నర నుంచి ఆరు అడుగులున్న నీరు రెండో రోజుకే రెండూ రెండున్నర అడుగులకు చేరింది. గేటుకు అటూ ఇటూ నిశ్చలంగా నిలిచిపోయిన నీళ్లు విసురుగా గాలి కొట్టినప్పుడు మాత్రమే గేటు దిగువకు జారుతున్నాయి. సోమవారం సాయంత్రం కనిపించిన నీటి ప్రవాహం.. మంగళవారం తెల్లారేసరికి మాయమైంది.
కుప్పం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన మానసిక భావజాలానికి నిదర్శనమని ఆ పార్టీ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. నాలుగేళ్ల 10నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్.. ఆఖరి నెలలో అద్భుతాలు చేస్తాననడం ప్రజల్ని వంచించడమేనని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com