పి.వి రమేష్‌ 'పీఏ'నని బురిడీ కొట్టించిన నూతన నాయుడు

పి.వి రమేష్‌ పీఏనని బురిడీ కొట్టించిన నూతన నాయుడు
విశాఖ శిరోముండనం కేసులో నూతన్‌నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు..

విశాఖ శిరోముండనం కేసులో నూతన్‌నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పడికే ఏడుగురిని అరెస్ట్ చేయగా 8 రోజుల తర్వాత నూతన్‌ నాయుడు అనూహ్యంగా కర్ణాటకలో అరెస్ట్ అయ్యాడు. శిరోముండనం ఘటన జరిగిన రోజు నూతన్‌ నాయుడు ఇంట్లో లేడు. ఆ తర్వాత నుంచి అతడి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆగస్టు 28న జరిగిన శిరోముండనం సమయంలో నూతన్‌ నాయుడు తన భార్యకు రెండుసార్లు సాధారణ కాల్, ఒక సారి వీడియో కాల్ చేశాడు. ఆ వీడియో కాల్‌లో శ్రీకాంత్ దుస్థితి కళ్లారా చూసినట్లు ఆధారాలు దొరికాయి. సీసీ టీవీ ఫుటేజ్‌ టైమింగ్, పోలీసులు దర్యాప్తులో లభించిన కాల్ డేటా, బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం అన్నీ ఒకే సమయంలో జరిగినట్లు నిర్ధారణ అయింది. తదుపరి రోజు పోలీసులు తాము సేకరించిన వీడియో ఫుటేజ్‌ మీడియాకు రిలీజ్ చేసేసరికి దాన్ని స్వయంగా చూసిన నూతన్‌ నాయుడు తన వారిని రక్షించుకునేందుకు అజ్ఞాతంలో వుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇందులో నూతన్‌ నాయుడు ప్రమేయం ఉన్నటు తేలింది.

అరెస్టయిన భార్య, ఇతర సిబ్బందిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే సమయానికి అతడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి రమేష్‌ పీఏ నని ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ పి.వి.సుధాకర్‌కు ఫోన్ చేశాడు. పలానా మహిళ మీ దగ్గరకు వస్తారని రెండు వారాల పాటు చికిత్స అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. అలాగే సింహాచలం డిస్పెన్సరీ వైద్యుడు వాసుదేవ్‌కు, డాక్టర్ సుజాతకు ఫోన్ చేశాడు. తాను ఎవరికైనా ఫోన్ చేస్తే అవతల వ్యక్తికి ట్రూకాలర్‌లో పీఏ టు చీఫ్ సెక్రటరీ అని వచ్చేటట్లు సెట్ చేసుకుని బురిడీ కొట్టించాలని చూశాడు నూతన్‌ నాయుడు. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్‌ తన పేరుమీద ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్లు చేస్తునట్లు తెలీడంతో సీపీకి నేరుగా ఫిర్యాదు చేశారు. ఇటు వైద్యులు కూడా అనుమానం వచ్చి సీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ నెంబర్‌ను ట్రేస్ చేయడంతో నూతన్‌ నాయుడే ఇదంతా చేయించినట్లు తేలింది. ఎట్టకేలకు అతన్ని కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.

శిరోముండనం కేసులో ఏ1 నిందితురాలిగా నూతన్‌ నాయుడు భార్య మధుప్రియను చేర్చారు. సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కూడా కేసు నమోదు చేశారు. శిరోముండనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైన నేపథ్యంలో కేసుకు బలమైన సాక్ష్యాలు దొరికినట్టయ్యింది. కత్తిరించిన జుట్టు కూడా ఘటనా స్థలంలో లభించినట్లు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. ఇంట్లో పని మానేశానన్న కోపంతోనే తనకు గుండు గీయించారని, తనపై తప్పుడు ఆరోపణలు చేసి కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడా ఇప్పుడు నూతన్ నాయుడు కూడా దొరకడంతో విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story