దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్

దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్
శిరోముండనం కేసులో విచారణ ఒక ఎత్తయితే.. ముఖ్య కార్యదర్శి పేరుతో నూతన్ నాయుడు కాలర్ ట్యూన్ పెట్టుకోవడం సంచలనంగా మారింది

విశాఖపట్నంలో దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఉడిపి రైల్వే స్టేషన్‌లో కర్నాటక పోలీసులకు చిక్కిన అతన్ని అక్కడి కోర్టులో హాజరు పరిచారు. 2 రోజుల్లో విశాఖ తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. శిరోముండనం సమయంలో అతను భార్యకు 2 సార్లు ఫోన్ చేసినట్టు గుర్తించామన్నారు విశాఖ సీపీ సిన్హా. శిరోముండనం కేసులో ఇప్పటికే నూతన్ భార్య సహా ఏడుగురి అరెస్ట్ చేశారు. నూతన్‌ భార్య సమక్షంలోనే దళిత యువకుడికి శిరోముండనం జరిగినట్టు నిర్థారించుకున్నారు. ఇప్పుడు ఇందులో నూతన్‌ నాయుడు ప్రమేయం ఉన్నటు తేలింది.

ఈ కేసు విచారణలో పోలీసులు కొత్త విషయాల్ని గుర్తించారు. నూతన్ నాయుడు నేర ప్రవృత్తికి సంబంధించి కొన్ని ఆధారాలు తమకు లభించాయన్నారు సీపీ. ముఖ్య కార్యదర్శి పీఏ పేరుతో కాలర్ ట్యూన్ పెట్టుకోవడం, రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ పేరుతో పలు మోసాలకు పాల్పడ్డట్టు తెలిసిందన్నారు. వీటన్నింటిపైన లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసు నుంచి తన భార్యను, అనుచరులను తప్పించేందుకు రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ పేరు వాడుకున్నాడని సీపీ చెప్తున్నారు. ట్రూకాలర్‌లో తన పేరు ముఖ్యకార్యదర్శి పీఏ అని వచ్చేలా సెట్ చేసుకున్నారన్నారు.

విశాఖలో దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో పెందుర్తి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఏ1 నిందితురాలిగా నూతన్‌ నాయుడు భార్య మధుప్రియను చేర్చారు. సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితుడి వీడియో వాంగ్మూలం రికార్డు చేశారు. శిరోముండనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైన నేపథ్యంలో కేసుకు బలమైన సాక్ష్యాలు దొరికినట్టయ్యింది. కత్తిరించిన జుట్టు కూడా ఘటనా స్థలంలో లభించినట్లు పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. ఇంట్లో పని మానేశానన్న కోపంతోనే తనకు గుండు గీయించారని, తనపై తప్పుడు ఆరోపణలు చేసి కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయడా ఇప్పుడు నూతన్ నాయుడు కూడా దొరకడంతో విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. శిరోముండనం కేసులో విచారణ ఒక ఎత్తయితే.. నూతన్ నాయుడు పలువురిని మోసం చేసినట్టు కూడా తేలడం, ముఖ్య కార్యదర్శి పేరుతో కాలర్ ట్యూన్ పెట్టుకోవడం లాంటివి కూడా సంచలనంగా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story