IPS : ఆ ఇద్దరు ఐపీఎస్ లకు మరో బిగ్ షాక్

IPS : ఆ ఇద్దరు ఐపీఎస్ లకు మరో బిగ్ షాక్
X
కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీలపై వృద్ధురాలి ఫిర్యాదు.. తన కుమారుడి కేసును తప్పు దారి పట్టించారని ఆవేదన

విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.50 కోట్ల ఆస్తికోసం తన కుమారుడిని కుటుంబ సభ్యులే హతమార్చిన కేసును.. ఈ ఇద్దరు ఐపీఎస్ లు గుండెపోటుగా మార్చి తప్పుదారి పట్టించారంటూ ఓ మహిళ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన విజయారాణి.. కాంతిరాణా, విశాల్‌గున్నీలపై ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

ఏమని ఫిర్యాదు చేశారంటే...

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన విజయారాణి.. ఈ ఫిర్యాదును చేశారు. తన కుమారుడు పేరుపై రూ.50 కోట్ల ఆస్తి ఉందని... అది కొట్టేయాలనే ఉద్దేశంతో తన భర్త రెండో భార్య కుమారుడు తన కుమారుని ముఖంపై యాసిడ్‌ పోసి చంపేశారని ఆమె ఆరోపించారు. కానీ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్నీ గుండెపోటుతో చనిపోయాడని కేసును పక్కదారి పట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని. నాకు న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు. దీంతో కేసు విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి సీఎం హామీ ఇచ్చారు.

జెత్వానీ కేసులోనూ ఆరోపణలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై సినీనటి కాదంబరి జత్వానీ కేసులో విజయవాడ మాజీ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీపై ఆరోపణలు వచ్చాయి. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, రిమాండ్‌ పంపడంతో పాటు తనను, కుటుంబాన్ని కస్టడీలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారంటూ నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన డీజీపీ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసులో ముందస్తు బెయిల్ కోసం విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్నీ ఇటీవలే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 1 వరకు విశాల్ గున్నీపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదపరి విచారణను అదే రోజుకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

Tags

Next Story