పిల్లాడి ప్రాణం తీసిన కాటుక డబ్బా..

పిల్లాడి ప్రాణం తీసిన కాటుక డబ్బా..
కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది

పుట్టి ఏడాదన్నా కాలేదు.. పుట్టించిన వాడికి కన్ను కుట్టినట్టుంది.. కాటుక డబ్బాని ఎరగా వేసి ప్రాణం తీసాడు.. కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.. ఇన్ని రోజులు వచ్చీ రాని నడకతో ఇల్లంతా తిరిగి సందడి చేసిన చిన్నారి ఇక లేడన్న విషయం తెలిసి నాన్న నమ్మలేకపోతున్నాడు. ఈ విషాద ఘటన ఇచ్చాపురం మున్సిపాలిటీ రత్తకన్నలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రత్తకన్నఒడియా వీధికి చెందిన గీత బిసాయికి శ్రీకాకుళం జిల్లా నెలవంక గ్రామానికి చెందిన కుమార్ దొళాయితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కొడుకు రెహాన్స్ ఉన్నాడు. పండక్కని పుట్టింటికి వచ్చిన గీత కొడుకు మొదటి పుట్టిన రోజు నవంబర్ 4 తేదీన అని నెలవంకకు బయలు దేరింది. ఈ క్రమంలో రెహన్‌కి కొత్త దుస్తులు వేసింది ఊరికి వెళుతున్నామని. బాబుకి కాటుకతో బొట్టు పెట్టి హాల్లోనే ఉంచి పూజ గదిలోకి వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుంటోంది. ఆడుకుంటున్న చిన్నారి కాస్తా అక్కడే ఉన్న కాటుక డబ్బాను మింగేసాడు.. గుక్క పట్టి ఏడుస్తున్న చిన్నారిని చూసి పరుగున వచ్చి చూసే సరికి నోటి నుంచి రక్తం కారుతోంది.

గొంతులో అడ్డంగా దిగబడడంతో ఊపిరి ఆడక బాబు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించారు. తల్లి గీతా బిసాయి చిన్నారిని మృతదేహాన్ని ఒడిలోకి తీసుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. ముద్దు ముద్దు మాటలలో మురిపించిన చిన్నారి మృత్యులోకాలకు చేరుకున్న వైనం తెలిసి గ్రామస్తులు కంట తడిపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story