ONGC: నిప్పుల కొలిమిలో కోనసీమ

ONGC: నిప్పుల కొలిమిలో కోనసీమ
X
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు... ఇళ్లు ఖాళీ చేసిన గ్రామస్థులు

పచ్చని కోనసీమలో మరోసారి ‘బ్లో ఔట్‌’ మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్‌ చేస్తున్న రిగ్‌ వద్ద గ్యాస్‌ లీకై... ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్‌ తీవ్రతకు వంద అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. కోనసీమ జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మలికిపురంలో ONGC డ్రిల్ సైట్‌లో బ్లో అవుట్ భయాందోళనకు గురిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 100 అడుగుల ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో బ్లోఅవుట్‌ ప్రాంతం నుంచి అర కిలోమీటరు వరకు 50 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

బ్లోఅవుట్‌‌కు కారణం ఇదే

ఇరుసుమండ గ్రామంలోని బ్లోఅవుట్‌ జరిగిన ప్రదేశంలో 1993లో ONGC డ్రిల్లింగ్‌ నిర్వహించి ఆ తర్వాత వదిలేసింది. 2024లో ఈ బావిని ONGC.. డీప్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సబ్‌లీజుకు ఇచ్చింది. ఇక్కడ భారీగా చమురు, గ్యాస్‌ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. దీంతో మరింత లోతుగా వెళ్లేటప్పుడు బాంబింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సమయంలో అధిక ఒత్తిడితో గ్యాస్‌ విస్ఫోటం సంభవించి మంటలు చెలరేగాయి.

వందల కోట్లలో నష్టం

ఇరుసుమండ బ్లోఅవుట్‌ నష్టం వందల కోట్లలో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని కీలలతో సుమారు 500 వరకు కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. పంటలు, ఆక్వాకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బావిలో గ్యాస్‌ పీడన స్థాయి తగ్గే వరకు మంటలను అదుపు చేయడం కష్టమని అంటున్నారు. కాగా గ్యాస్‌ లీకైనప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్థులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతానికైతే ఇంకా కోనసీమ బ్లోఅవుట్‌ మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసుమండ బ్లోఅవుట్ దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది. గూడపల్లి-1 కాలువ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టారు. పైపులు వేసి నిరంతరం నీటిని జల్లుతున్నారు ఫైర్‌ సిబ్బంది. అడ్వాన్స్‌డ్‌ వాటర్‌ టెండర్లను మోహరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్‌ టీమ్స్‌ వస్తున్నాయి. అలాగే వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు.

స్పందించిన సర్కార్

కోనసీమ జిల్లా, మలికిపురం మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై సమీక్ష జరిపారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా స్పందించారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

Tags

Next Story