అంతర్వేదిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. హిందూ సంఘాల ఆందోళన

అంతర్వేదిలో  కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. హిందూ సంఘాల ఆందోళన
అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.. రథం దగ్ధం ఘటనపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి.. ఆందోళనలు మరింత..

అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.. రథం దగ్ధం ఘటనపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి.. ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఘటనపై కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. నాలుగురోజులైనా ఏం జరిగిందో తేల్చకపోవడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.. బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాయి.. నిన్నంతా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.. మంత్రులను సైతం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితలు తలెత్తాయి.. ఇక ఈరోజు కూడా ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి.. అంతర్వేది పర్యటనకు బీజేపీ నేతలు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అటు జనసేనతోపాటు వివిధ ధార్మిక, మత సంస్థలు కూడా చలో అంతర్వేదికి పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు.. ఇక జిల్లాలోన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌ఎపీ, జనసేన నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

మరోవైపు అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. హిందూ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. ఇతరులు ఎవరినీ ఈ ప్రాంతంలోకి అనుమతి ఇవ్వడం లేదు.. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ తెలిపారు.. ఘటనా స్థలం దగ్గర క్యాంప్‌ ఏర్పాటు చేశామన్నారు.. పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు.. ఫోరెన్సిక్‌ శాఖకు చెందిన నిపుణులు పరిశీలన జరుపుతున్నారన్నారు. అయితే, పలువురు అనుమానితులను ప్రశ్నించినప్పటికీ ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఇప్పటి వరకు క్లారిటీకి రాకపోవడంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఇంకెన్ని ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగితే చర్యలు తీసుకుంటారంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

అటు ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.. అంతర్వేది ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారన్నారు.. రాజకీయాలు చేయడానికి ఇది సరైనసమయం కాదని అన్నారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అయితే, కావాలనే ఎవరూ రథాన్ని తగులబెట్టరంటూ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి.. కుట్ర కోణం తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక ఆందోళనల మధ్యే అంతర్వేది ఆలయ కొత్త ఈవో భద్రాజీ బాధ్యతలు చేపట్టారు.. ఆలయ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.. ఆలయన రథం దగ్ధం కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భద్రాజీ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story