ఉల్లి రైతు పంట పండింది..

ఉల్లి రైతు పంట పండింది..

కర్నూలు జిల్లాలో రైతులు... ఉల్లిని ఎక్కువగా సాగు చేస్తారు. ఈ జిల్లా ఉల్లి మధ్యరకంగా ఉంటూ.. ఎక్కువ ఘాటుగా ఉండటంతో.. ప్రతి ఒక్కరూ కర్నూలు ఉల్లిని ఇష్టపడుతారు. అందుకే ఒక్క జిల్లాలోనే కాకుండా... కొంతమంది రైతులు నేరుగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తాడేపల్లిగూడెం నుంచి ఇతర రాష్ట్రాలకు కర్నూలు ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం కర్నూలు ఉల్లి.. చెన్నై , అమరావతికి ఎగుమతి అవుతోంది. ఈ సారి భారీ వర్షాల కారణంగా రైతులకు అపార నష్టాలను తెచ్చిపెట్టాయి. ప్రధానంగా ఉల్లి పంట ఎక్కువగా దెబ్బ తినింది. జిల్లాలో ఖరీఫ్‌ను నమ్ముకుని పెద్ద మొత్తంలో రైతులు ఉల్లిని సాగు చేశారు. ఎకరాకు రూ. 40 వేల నుంచి 70వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో.. కుండపోత వర్షాలతో పొలాల్లోనే ఉల్లి దెబ్బతినింది..

దీంతో.. అరకొరగా సాగైన ఉల్లికి ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చేసింది. సైజు, నాణ్యత లేకపోయినా... వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు క్వింటం రూ. 3వేలకు మించని ఉల్లి.. ఇప్పుడు ఏకంగా 6వేల 6వందలకు చేరింది. వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రోజురోజుకు ధర పెరుగుతునే ఉంది. పంటను మార్కెట్‌ తెచ్చుకున్న రైతులకు ఊరట లభిస్తుంది. కానీ వర్షాలతో... పొలాల్లోనే ఉన్న ఉల్లి పంటలు మాత్రం దెబ్బతిని పెట్టబడులు కూడా చేతికి రావడం లేదు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు..

గత ఏడాది క్వింటం ఉల్లి అత్యధికంగా రూ.10 వేల వరకు మార్కెట్‌లో ధర పలికింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి రావచ్చంటున్నారు వ్యవసాయశాఖ అధికారులు. ఇప్పుడే క్వింటం 7వేలకు చేరిందంటే... ఇకపై పదివేలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి 70 రూపాయల నుంచి 80 వరకు అమ్మతున్నారు. త్వరలోనే ఈ ధర రూ. వంద లేదా అంతకు మించి ఉండొచ్చంటున్నారు. ఒక పక్క కరోనా కష్టాలు, మరోపక్క భారీ వర్షాలతో.. అతలాకుతలమైన సామాన్యులు ఇప్పుడు ఉల్లిని కొనలేని స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని... . అటు రైతుకు, ఇటు సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా చూడాలంటున్నారు జనం.

Tags

Read MoreRead Less
Next Story